ఆ పాత్ర గురించి చెప్పగానే రజనీకాంత్ గుర్తొచ్చారు!
‘‘మంచి హీరో అనిపించుకునేకన్నా మంచి నటుడు అనిపించుకుంటే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఎటువంటి పాత్రను అయినా చేయగలడనే గుర్తింపు ఉంటే చాలు. నా సినిమాలు చూసి, ప్రేక్షకులు ఆనందించాలనీ, తీసే నిర్మాతలు లాభపడాలని కోరుకుంటా’’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. మను దర్శకత్వంలో ఆయన నటించిన ‘రైట్ రైట్’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు...
♦ గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం ‘రైట్ రైట్’. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో ఊహకందని అంశాలుంటాయి. ఇందులో పోలీస్ అవుదామని శాయశక్తులా ప్రయత్నించి, చివరకు బస్ కండక్టర్ అవుతాను. కండక్టర్ పాత్ర అని దర్శకుడు చెప్పగానే రజనీకాంత్ గారు గుర్తొచ్చారు. కండక్టర్‌గా ఆయన జీవితం మొదలై, సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. రజనీగారి సినిమాలు చాలా చూశాను.
♦ వాస్తవానికి సెకండాఫ్ కథ విన్నప్పుడు నాకు భయమేసింది. ఆ సీన్స్‌లో నటించేందుకు నేను, ప్రభాకర్ షాట్ షాట్‌కి మధ్య పది నిముషాలు టైమ్ తీసుకుని, డిస్కస్ చేసుకుని నటించాం. కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడకుండా న్యాచురల్‌గా నటించాం. ఓ సీన్‌లో ప్రభాకర్‌గారి ఎమోషనల్ డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ చూసి యూనిట్ మొత్తానికి కన్నీళ్లొచ్చాయి. ఇప్పటివరకూ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రభాకర్ మెప్పించారు. ఈ సినిమా చూసినవాళ్లు ఆయన ఎలాంటి పాత్రైనా చేయగలరని అంటారు. డెరైక్టర్ మను వెరీ టాలెంటెడ్. ఈ చిత్రకథను అద్భుతంగా తెరకెక్కిం చారు. వంశీకృష్ణగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
♦ ‘శ్రీమంతుడు’ని చూసి, అందులో మహేశ్‌బాబుగారు చెప్పిన ‘రైట్ రైట్’ డైలాగ్ నచ్చి, ఈ చిత్రానికి టైటిల్ పెట్టామన్నది కొంతమంది ఊహ. అయితే, స్క్రిప్ట్ చదివినప్పుడే నాన్నగారు టైటిల్ చెప్పేశారు. మేము రిజస్టర్ చేయించిన ఏడాది తర్వాత ‘శ్రీమంతుడు’ వచ్చింది.
♦ కథల ఎంపిక విషయంలో మా నాన్న (ఎమ్మెస్ రాజు)గారి జోక్యం ఉంటుందని, ముందు ఆయనే వింటారని కొంతమంది అనుకుంటున్నారు. కానీ, ఏ కథ అయినా మొదట నేనే వింటా. నాకు నచ్చితే నాన్నగారితో డిస్కస్ చేస్తా. ఎందుకంటే ఆయన ఎక్స్‌పీరియన్స్, జడ్జ్‌మెంట్ నాకు హెల్ప్ అవుతాయి. ఆ తరువాత ఏమైనా మార్పులు, చేర్పులు అవసరమైతే ఆయన చెబుతుంటారు.
♦ ప్రస్తుతం నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథలు ఎంచుకుంటున్నా. ఇప్పుడు కాలేజీ కుర్రాడిగా చేయగలను కానీ పదేళ్ల తర్వాత చేయలేను కదా? ఇప్పుడే యాక్షన్ అంటూ నేను ఓ వందమందిని కొడితే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. మొదట్లో ఆమిర్‌ఖాన్, సూర్య వంటి వారు మామూలు చిత్రాలు చేసి, ఆ తరువాత మాస్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వారు ఏ చిత్రం చేసినా అవి చూసి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. నేనూ ఆ స్థాయికి చేరుకోవాలంటే కొంచెం టైం పడుతుంది.
♦ ఇటీవల ‘ద్రోణ’ చిత్ర దర్శకుడు జె.కరుణ్ కుమార్ చెప్పిన కథ నచ్చింది. నా తదుపరి చిత్రం ఆయన దర్శకత్వంలోనే ఉంటుంది.