మా కెమిస్ట్రీ కుదిరింది!
‘‘పోలీస్ కావాలని హైదరాబాద్‌కొచ్చా. ఉద్యోగం ఇప్పిస్తామంటూ చాలామంది నన్ను మోసం చేశారు. కానీ, దేవుడు మాత్రం మోసం చేయకుండా నటుడిగా ఈ స్థాయికి చేరుకునేలా చేశాడు. రాజమౌళిగారు ‘మర్యాద రామన్న’, ‘బాహుబలి’లో నాకు మంచి గుర్తింపు తెచ్చే పాత్రలు ఇచ్చారు’’ అని ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ నిర్మించిన ‘రైట్ రైట్’ ఈ నెల 10న విడుదలవుతోంది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన ప్రభాకర్ మాట్లాడుతూ - ‘‘ ‘బాహుబలి’ తర్వాత నేను చేసిన ఫుల్‌లెంగ్త్ మూవీ ఇదే. సాధారణంగా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది అంటారు. కానీ, ఈ చిత్రంలో నాకు, సుమంత్ అశ్విన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సుమంత్ డ్రైవర్.. నేను కండక్టర్. ఇందులో డ్యాన్స్ చేశా. డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్‌లు తప్పక చూడాల్సిన సినిమా ఇది. నిర్మాత ఎమ్మెస్ రాజుగారు, దర్శకుడు మను నాకు చాలా సపోర్ట్ చేశారు.
ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి వెళ్లినప్పుడు విదేశీయులు కూడా నా నటన మెచ్చుకుంటుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం గోపీచంద్ ‘ఆక్సిజన్’లో విలన్‌గా, మలయాళంలో మోహన్‌లాల్ చిత్రంలో ప్రధానపాత్ర చేస్తున్నా. ఇంకా ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘కాలకేయ వర్సెస్ కాట్రవల్లి’, కన్నడంలో మూడు సినిమాలు చేస్తున్నా’’ అని చెప్పారు.