
నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడిలతో హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్
రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు. మరో సారి దిల్ రాజు బ్యానర్ లో ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్. మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్‌తేజ్‌లు కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
వెంకీ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వరుణ్ కూడా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే అనిల్ దర్శకత్వంలో ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సినిమాను కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ ఇద్దరు హీరోలు. ఎఫ్ 2 షూటింగ్ జూన్ లో ప్రారంభిస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.