ఫేక్ మెసేజ్ తెచ్చిన తంటా!
Published Fri, Nov 8 2013 12:15 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సైబర్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా అందాల భామ అనుష్కశర్మ కూడా చేరడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆకతాయిలు చేసిన అల్లరి పని వల్ల బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ ఆర్. ఖాన్‌ని అనవసరంగా నిందించి, చటుక్కున నాలిక కరుచున్నారు అనుష్క. వివరాల్లోకెళితే... మహిళలపై జరుగుతున్న వేధింపుల నేపథ్యంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘దట్‌డే ఆఫ్టర్ ఎవ్విరిడే’ అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ లఘుచిత్రం విపరీతంగా నచ్చేయడంతో ‘అనురాగ్ ప్రయత్నం చాలా బాగుంది’ అని ట్విట్టర్ ద్వారా అభినందించారు అనుష్క. ఎప్పుడైతే ట్విట్టర్‌లో అనుష్క ఈ మెసేజ్ పోస్ట్ చేశారో... అప్పట్నుంచీ ఈ ముద్దుగుమ్మకు వేధింపులు మొదలయ్యాయి.
కమల్ ఆర్ ఖాన్ పేరు మీద ఉన్న ఫేక్ ట్విట్టర్ ఎకౌంట్ ఈ వేధింపులకు సాధనం అయ్యింది. అనురాగ్ కశ్యప్‌తో అక్రమ సంబంధాన్ని అంటగడుతూ చాలా అసభ్యకరంగా మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. ఈ మెసేజ్‌లు చూసి ఖంగు తినడం అనుష్క వంతైంది. ఇంకేముందీ... కమల్ ఖానే ఈ మెసేజ్‌లను పోస్ట్ చేశాడనుకొని తనకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది అనుష్క. ఆమెతో పాటు ఆమె అభిమానులు కూడా ఖాన్‌పై విరుచుకుపడ్డారు. దీన్ని చూసి ఖంగు తిన్న ఖాన్... అసలు విషయం చెప్పడంతో నాలిక కరుచుకోవడం అనుష్క వంతైంది. వెంటనే ఖాన్‌ని క్షమాపణ కోరారు అనుష్క. ఈ ఆకతాయి పని చేసిన వారిని పట్టుకునే పనిలో ప్రస్తుతం క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు ఉన్నారు.
Advertisement
Advertisement