ఆయన సినిమాలన్నీ నా లైబ్రరీలో ఉన్నాయి
► నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
‘‘నేను చిత్ర పరిశ్రమకు రావాలనుకున్నప్పుడు వంశీగారి సినిమాలనే ఎక్కువగా చూశా. ప్రతి పాత్రలో తెలుగుదనాన్ని చూపిస్తారు. వంశీగారికి టెక్నికల్‌గా మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన పాతిక సినిమాలు నా మూవీ లైబ్రరీలో ఉంచాను. వంశీగారి తాజా చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్’ పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి. సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలీ రాథోడ్, మానసా హిమవర్ష హీరో హీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్’.
మణిశర్మ స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని విడుదల చేయడంతో పాటు ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. దర్శకుడు వీవీ వినాయక్ సినిమా విడుదల తేదీ (జూన్ 2) బోర్డ్‌ని ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లా డుతూ– ‘‘లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల’ చిత్రాలు చూసి వంశీగారికి పెద్ద ఫ్యాన్ అయ్యా. ‘సితార, అన్వేషణ’ సినిమాలు చూసి, ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టా. మణిశర్మగారి ‘ఖుషి’ సినిమా పాటల్ని వెయ్యిసార్లు చూసుంటా’’ అన్నారు. ‘‘వంశీ, మణిశర్మ గారి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం.
ఓ అభిమానిగా వాళ్ల కాంబినేషన్‌లో ‘ఫ్యాషన్ డిజైనర్’ తీశా. మణిశర్మగారు మంచి పాటలిచ్చారు. మా ‘మధుర’ ఆడియో ఆల్బమ్స్‌లో ఇదే బెస్ట్’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘వంశీగారిదో ప్రత్యేకమైన శైలి. ‘లేడీస్ టైలర్’ని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు’’ అన్నారు వినాయక్. దర్శకుడు వంశీ, నిర్మాతలు ఎమ్మెస్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ, లగడపాటి శ్రీధర్, నటులు తనికెళ్ల భరణి, దర్శకులు బి.గోపాల్, బీవీయస్ రవి,æహీరో విజయ్ దేవరకొండ, సంగీత దర్శకుడు రఘుకుంచె తదితరులు పాల్గొన్నారు.