ఫిల్మ్ జర్నలిస్టుల భద్రతకై ‘ఎఫ్ఎన్ఏఈఎమ్’ | Film News Casters Association of Electronic Media Pressmeet | Sakshi
Sakshi News home page

ఫిల్మ్ జర్నలిస్టుల భద్రతకై ‘ఎఫ్ఎన్ఏఈఎమ్’

Published Tue, Mar 26 2019 10:31 AM | Last Updated on Tue, Mar 26 2019 10:31 AM

Film News Casters Association of Electronic Media Pressmeet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ (ఎఫ్ఎన్ఏఈఎమ్‌) సభ్యులకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో హెల్త్ కార్డులను, అసోసియేషన్ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్‌ డైరీని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యుల ఐడీ కార్డులను ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, టర్మ్ పాలసీని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన నవీన్ ఎర్నేని, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), యాక్సిడెంటల్ పాలసీని సాయిధరమ్ తేజ్, మెడికల్ పాలసీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు.

గతంలో అధ్యకక్షుడిగా పనిచేసిన ప్రసాదం రఘు నూతన కార్యవర్గాన్ని అందరికీ పరిచయం చేశారు. ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్‌ అసోసియేషన్.. దీన్ని 2004లో ప్రారంభించాం. ఎంతోమందికి నిజంగా అవసరమైనప్పుడు సహాయం చేశాం. ఇప్పుడు సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఇటీవల మనవాళ్లకు కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఇబ్బందులు, సమస్యలు వచ్చాయి. అప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయగలిగినా... చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇలా జరుగుతున్న తరుణంలో అందరం కలిసి ఎక్కువమందిని సభ్యులుగా చేర్చుకుని అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనుకున్నాం. అందర్నీ కలుపుకుని ముందుకు వెల్దామనే ఉద్దేశంతో అసోసియేషన్ కి కొత్త ప్యానల్ ని ఎన్నుకున్నాం.

ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలను, హారిక అండ్ హాసిని అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు)గారిని కలిశాం. మేం హెల్త్ కార్డుల గురించి చేస్తున్న కృషి తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ తనవంతుగా ఆర్ధిక సహాయం అందించాడు. ఈ సంగతి డిస్కస్ చేయడానికి దిల్ రాజుగారిదగ్గరకు వెళ్ళినప్పుడు... ఈ సంవత్సరం హెల్త్ కార్డులకు ఎంత అయితే అంత నేను ఇస్తాను. ఈ సంవత్సరానికి నేనే భరిస్తాను అని ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ ఏడాది జర్నలిస్టుల హెల్త్ కార్డులకు అయిన రూ. 18 లక్షలను దిల్ రాజుగారు ఇచ్చారు’ అని తెలిపారు. 



హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘ఒక సదుద్దేశంతో నన్ను సంప్రదించారు. నేను చాలా సంతోషంగా ఈ లక్ష్యసాధనలో ఓ భాగం అయ్యాను. ప్రతి సినిమాకూ మీడియా ప్రతినిధులు మద్దతు ఇస్తూ, ఆశీర్వదిస్తున్నారు. నటుడిగా ఈ లక్ష్యానికి నావంతు మద్దతు ఇవ్వాలని అనుకున్నా’ అన్నారు.

ఎతికా కంపెనీ సీఈఓ సుశీల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ తీసుకున్న పాలసీలో, మొదటి రోజు నుంచి అంతకు ముందు ఉన్న అనారోగ్యాలకూ మెడికల్ కవరేజ్ వస్తుందన్నారు. సురేంద్ర కుమార్ నాయుడు మాట్లాడుతూ ‘ మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. అనివార్య కారణాలు, ఘటనల వల్ల అసోసియేషన్ సభ్యులు ఆఫీసులకు వెళ్లలేకపోతే... వారికి కొన్ని వారాల పాటు జీతం అందజేయాలని నిర్ణయించాం. అసోసియేషన్ సభ్యులందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు ఇవి. ఇందులో కొత్తవారు కూడా జాయిన్ అవొచ్చు. మొదటి విడతగా 150 మందిని జాయిన్ చేసుకున్నాం. రెండో విడతలో ఇంకా అర్హులైన వారు ఎంతమంది ఉన్నారో... అందర్నీ అసోసియేషన్ లోకి తీసుకుంటాం.’ అన్నారు.

దిల్ రాజు  మాట్లాడుతూ ‘ఒక సదుద్దేశంతో ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న కార్యక్రమం ఇది. 20 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఇక్కడ ఉన్న మీడియా వాళ్లు అందరూ చాలా క్లోజ్. వారంలో ఒక్కసారైనా ఏదో ఒక ఈవెంట్ లో కలుస్తుంటాం. అటువంటి నా మిత్రుల కోసం మంచి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇది ఇక్కడితో ఆగదు. ఇదే మొదలు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకు రావాలి. మనమంతా ఒక కుటుంబం’ అన్నారు.

ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ చాలా పెద్ద బాధ్యత తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందు బ్యాక్ ఎండ్ లో ఎంత పని చేసి ఉంటారో నేను ఆలోచించగలను. ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే పని మనమంతా చేస్తున్నాం. మేం సినిమాలు తీయడం గానీ, వాటికి సంబంధించి వార్తలు రాయడం గానీ.. ప్రతిదీ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచేదే. సినిమా చూసి రివ్యూ రాయాలన్నా... వార్తలు రాయాలన్నా... మీడియా ప్రతినిధులు ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే... జీవితం పట్ల భరోసా ఉన్నప్పుడు. అటువంటి భరోసా ఇచ్చే ఈ కార్యక్రమం మరింత ఉదృతంగా జరగాలి. 'దిల్' రాజుగారు చెప్పినట్టు ఇది ఆరంభం మాత్రమే. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎంత భరోసా ఉంటుందో... ఫిల్మ్ జర్నలిస్ట్ కి అంతే భరోసా ఉండాలి. దానికి మేం ఏం చేయగలిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా చెబుతున్నా.  ఈ రోజు ఒక గొప్ప పనికి పునాది పడింది. ఈ అసోసియేషన్ ఒక స్ట్రక్చర్ ని తయారు చేస్తుంది. ఇది ఇంకా బలంగా... దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల్లోకి బలంగా వెళ్లాలని కోరుకుంటున్నా అన్నారు.

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ‘వెబ్ జర్నలిజానికి పెద్దగా గుర్తింపు, అక్రిడేషన్ లేవు. వారికి ఈ పథకం చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎటువంటి పరిమితులు లేకుండా ఈ అసోసియేషన్ ఇచ్చిన భరోసా చాలా పెద్దది. ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు. తరవాత జర్నలిస్టుల జీవితాలు బాగు పరచడానికి మరిన్ని పథకాలు ప్రవేశ పెట్టాలని కోరుకుంటున్నా’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement