
బాబీ జసూస్ ఫస్ట్‌లుక్ అదుర్స్..!
విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘బాబీ జసూస్’ చిత్రం ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా ద్వారా డిటెక్టివ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విద్యాబాలన్‌కు మరోసారి అవార్డుల పంట పండడం ఖాయమని చెబుతున్నారు. ‘డర్టీ పిక్చర్’తో బాలీవుడ్‌లో విద్యాబాలన్‌కు దక్కిన గుర్తింపు అంతాఇంతా కాదు. ఇప్పుడు ఈ సినిమాద్వారా కూడా ఆమెకు మరింత గుర్తింపు దక్కుతుం దంటున్నారు. ప్రైవేటు డిటెక్టివ్‌గా విద్యాబాలన్ వేషధారణ భలే బాగుం దని, ఈ పాత్రద్వారా ఆమె అభిమానులను అలరించడమేకాదు మరోసారి జాతీయ అవార్డును ఎగరేసుకుపోవడం ఖాయమని చెబుతున్నారు. ‘బర్న్ ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దియా మీర్జా, ఆమె ప్రియుడు సాహిల్ సంఘా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్ షేఖ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాకు శంతను మొయిత్రా స్వరాలు సమకూర్చారు.
డిటెక్టివ్‌ల సమక్షంలో ట్రెయిలర్స్ విడుదల...
ఈ సినిమాకు సంబంధించిన ట్రెయిలర్స్‌ను కూడా విభిన్నంగా విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. ట్రెయిలర్స్‌ను వృత్తిరీత్యా డిటెక్టివ్‌లుగా కొనసాగుతున్న వారి సమక్షంలో కథానాయిక విద్యాబాలన్ విడుదల చేస్తుందని చెబుతున్నారు. ‘అవును నిజమే ట్రెయిలర్స్ విడుదల కార్యక్రమానికి డిటెక్టివ్‌లను ఆహ్వానించాలనుకుంటున్నామ’ని చిత్రబృందం సభ్యుడొకరు తెలిపాడు. కార్యక్రమం నెలాఖరులో ఉండే అవకాశం ఉందని చెప్పాడు. సినిమాల్లో డిటెక్టివ్ పాత్రను పోషిస్తున్న మొదటి నటిగా విద్యాబాలన్ తనదైన ముద్ర వేస్తుందని, ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.