బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ ఎయిర్ లిఫ్ట్ ఫస్ట్ పోస్టర్ విడుదల అయింది.
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'ఎయిర్ లిఫ్ట్' ఫస్ట్ పోస్టర్ విడుదల అయింది. రాజ్ క్రిష్ణ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్లుక్ ను సోషల్ మీడియాలో అక్షయ్ మంగళవారం రిలీజ్ చేశారు.
బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పోస్టర్ను ఫేస్ బుక్ పేజ్ లో, ట్విట్టర్ లో అక్షయ్ షేర్ చేశారు. ఈ సందర్భంగా 'కువైట్లో ఘటనలో ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమందికి తెలుసు.. ఒక యథార్థ గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఇలాంటి సినిమాలో భాగం కావడం' తనకు చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్ చేశారు.
కాగా కువైట్‌లో 1990లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం 'ఎయిర్ లిఫ్ట్'. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, లంచ్ బాక్స్ ఫేం హీరోయిన్ నిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే క్రమంలో ఎదురైన పరిస్థితులను దర్శకుడు రాజ్ మీనన్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్ అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే బుధవారం చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అక్షయ్ తెలిపారు.
అక్షయ్తో పాటు ఈ చిత్ర సహ నిర్మాత నిఖిల్ అద్వానీ కూడా 1990 నాటి దుర్ఘటను మళ్లీ తలచుకోవడం విచారకరమని ట్విట్ చేశారు. ఏ యుద్ధంలోనైనా అమాయక ప్రజలే బలైపోతున్నారని వ్యాఖ్యానించారు.