శ్రీనగర్‌కాలనీ: సినిమా, టీవీ రంగాలకు ఎంత ప్రాధాన్యత ఉందో నేడు డిజిటల్ రంగానికి అంతే డిమాండ్ పెరిగింది. రాబోయే కాలంలో డిజిటల్ రంగం మరింత కొత్త పుంతలు తొక్కుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. డిజిటల్‌లో వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. అలా ఇటీవల విడుదలై నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి). ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి చిత్రాల దర్శకుడు, రచయిత అనీష్ కురివిళ్ళ దర్శకత్వంలో మహిళా నిర్మాత రాధిక లావు, జీ5 యాప్ సంయుక్తంగా గాడ్ వెబ్ సిరిస్‌ను నిర్మించాయి. రాయలసీమ రాజకీయ నేపథ్యంలో బోల్డ్, రా కంటెంట్‌తో సాగే ఈ వెబ్‌సిరీస్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. వెబ్‌సిరీస్‌ల గురించి, గాడ్ సిరీస్ గురించి దర్శకుడు అనీష్ కురివిళ్ళ సాక్షితో మాట్లాడారు. ఆయన మాటల్లో...
వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేక డిమాండ్..
నేడు వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేక డిమాండ్‌తో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. కో అంటే కోటి చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించాను. దర్శకత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల పట్టాటెక్కలేదు. ఈ సంవత్సరం ప్రథమంలో ఓ స్టోరీ ఐడియాతో మహిళా నిర్మాత రాధిక లావు, జీ5 యాప్ నన్ను సంప్రదించారు. సోరీకి నా స్టైల్‌కు తగ్గట్టు కొత్తరీతిలో ప్రేక్షకులకు అందించాలంటే నాకు కొంత సమయం కావాలని చెప్పాను. అలా ఈ స్టోరీ ఐడియాను మా టీం కో స్క్రిప్ట్ రైటర్ హంజా అలీ, డైలాగ్ రైటర్ భరత్ కార్తీక్, స్క్రిప్ట్ అసిస్టెంట్ నీలగిరితో కలిసి రెండు నెలలు కష్టపడి కొత్తతరహా స్క్రిప్ట్‌ను 10 ఎపిసోడ్స్‌గా మూడు సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో అలా 6 గంటల వెబ్‌సిరీస్‌ను ప్రారంభించాం. డైలాగ్ రైటర్ భరత్ కార్తీక్ కడపకు చెందిన వ్యక్తి. తను కడప, రాయలసీమ స్లాంగ్‌ను, డైలాగ్స్ రూపంలో చాలా బాగా రాశాడు. వెబ్‌సిరీస్‌ను చూస్తే ఎక్కడా నెటిజన్లకు బోర్ కొట్టకుండా సినిమాలా తీయాలని గట్టిగా అనుకున్నాం. అలా గాడ్ పట్టాలెక్కింది.
గ్యాంగ్‌స్టర్– సీమ రాజకీయాలు...
వెబ్‌సిరీస్‌ను కూల్‌గా ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని అందించేలా స్క్రిప్ట్‌ను తయారుచేశాం. 1970 ప్రాంతంలో ఓ కుటుంబం బతుకుదెరువు కోసం ఓ కొత్త ప్రదేశానికి వెళుతుంది. అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించిన కుటుంబంలోని పెద్ద ఎలా గ్యాంగ్‌స్టర్‌గా రాజకీయ నాయకుడిగా ఎదిగాడో చెబుతుంది. ప్రతి ఎపిసోడ్‌కు సినిమా తరహాలో బిగినింగ్, మిడిల్, ఎండింగ్ ఉండేలా ప్లాన్‌చేశాం. బోల్డ్ డైలాగ్స్, రా కంటెంట్‌తో రాజకీయ పార్టీలు , సీమ రాజకీయాలు, కుటుంబంలోని పాత్రలతో వెబ్‌సిరీస్ ఉంటుంది. అప్పుడు కోపంలో, సంతోషంలో, విషాదంలో ఎలా మాట్లాడతారో..అలాబోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. చిత్రంలో నటుడు ఎల్‌బీ శ్రీరాం డీఎన్ రెడ్డి పాత్రలో జీవించారు. ఈ వెబ్‌సిరీస్‌కు సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ అద్బుతంగా ఇచ్చాడు. సుద్దాల అశోక్‌తేజ రచనలో రాకాసి పాట నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది.
కొత్త ప్రదేశంలో చిత్రీకరణ..
1970 ప్రాంతంలో పరిస్థితులు, అప్పటి స్థితిగతులు ఎలా ఉంటాయో చెప్పాలంటే ప్రత్యేకమైన ప్రదేశం కావాలి. అలా కర్ణాటక ప్రాంతంలో సీమకు దగ్గరగా ఓ ప్రదేశాన్ని చూశాం. ఈ ప్రదేశమే యునెస్కో హెరిటేజ్‌గా పేరొందిన అనెగుండి. అక్కడ కొత్తగా నిర్మాణాలు చేపట్టడానికి ఉండదు. రెండంతస్తుల భవనం కూడా ఉండదు. ఇక్కడ ఇళ్ళు, నిర్మాణాలు చాలా పురాతనమైనవి. అక్కడ రాళ్ళు మాట్లాడేలా కట్టడాలు, కొండలు ఉంటాయి. ఇక్కడే షూటింగ్ చేశాం. చాలా మంచి అనుభూతితో పాటు చాలా హెల్ప్ అయింది ఈ ప్రదేశం. మైనింగ్ సన్నివేశాలను బళ్ళారిలో చిత్రీకరించాం.
టీం వర్క్‌తోనే విజయం..
ఏదైనా టీం వర్క్‌తోనే విజయం సాధిస్తాం. రైటింగ్ టీంతో పాటు యాక్టర్స్, చిత్ర యూనిట్ వెబ్‌సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. తెలుగు వెబ్‌సిరీస్‌లో గాడ్స్ ఆఫ్ దర్మపురి కొత్త తరహాను చూపించిందని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. నాకు తెలిసి భవిష్యత్‌లో వెబ్‌సిరీస్‌కు, యాప్స్‌కు సినిమాకు మించిన డిమాండ్ ఉంటుందని నా అభిప్రాయం. సినిమా దర్శకుడిగా వెబ్‌సిరీస్‌లకు మరింత ఆదరణ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే సినిమా, టీవీలాగా వెబ్‌సిరీస్ ద్వారా మరికొంత మందికి ఉపాధి కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment