హవీష్ వాయిస్ బాగుంటుంది : పరుచూరి గోపాలకృష్ణ
‘‘అన్నగారు ఎన్టీఆర్ నటించిన ‘నా దేశం’ చిత్రాన్ని 21 రోజుల్లో తీశారు. ఆ సినిమా వంద రోజులాడింది. ఇప్పుడీ చిత్రాన్ని దాసరి కిరణ్‌కుమార్ 38 రోజుల్లో తీశారు. ఈ రోజుల్లో ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం చిన్న విషయం కాదు. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలి. హవీష్ కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. తన వాయిస్‌కీ, శారీరక భాషకూ తగ్గ పాత్రను ఇందులో చేశాడు’’ అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. కోనేరు సత్యనారాయణ సమర్పణలో హవీష్ హీరోగా దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘రామ్‌లీలా’. లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాటల విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.
హవీష్ మాట్లాడుతూ -‘‘ ‘జీనియస్’ తర్వాత మళ్లీ ఇదే సంస్థలో చేయడం ఆనందంగా ఉంది. శ్రీపురం కిరణ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం . సినిమా ఘనవిజయం సాధించడం ఖాయం. ‘జీనియస్’కి అర్ధశతదినోత్సవం జరిపాం. ఈ చిత్రానికి శత దినోత్సవం చేస్తాం. అంత నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రంలో మా అబ్బాయి హవీష్ కొత్తగా కనిపిస్తాడు. చిత్రబృందం అంతా ఎంతో కష్టపడి చేశారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది’’ అని కోనేరు సత్యనారాయణ చెప్పారు. ఎస్. గోపాలరెడ్డి, విస్సు, నందిత, చిన్నా, ముత్యాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.