అది అత్యాచారం కన్నా ఘోరం | Hansika Motwani Special Interview | Sakshi
Sakshi News home page

అది అత్యాచారం కన్నా ఘోరం

Published Sat, Mar 7 2015 1:47 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

అది అత్యాచారం కన్నా ఘోరం - Sakshi

అది అత్యాచారం కన్నా ఘోరం

తమిళసినిమా: నటనలోనే కాదు, మాటలోను చక్కని పరిపక్వత పొందిన నటి హన్సిక. జీవితం చాలా నేర్పుతుందంటారు. అలా తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటిస్తూ ఎందరో మనుషుల మనస్తత్వాలను చదివిన ఈ ముద్దుగుమ్మకు సినిమా చాలా నేర్పిందనే కంటే ఆమె నేర్చుకున్నారనడం సబబుగా ఉంటుంది. ప్రస్తుతం ప్రముఖ నాయకిగా విరాజిల్లుతున్న హన్సికకు ఈ స్థాయి అంత సులభంగా రాలేదన్నది నిజం...

చాలామంది నటీమణుల మాదిరిగానే ఈ బ్యూటీ సినీ జీవితం అపజయాలతోనే ఆరంభమైంది. కోలీవుడ్‌లో తొలి చిత్రం మాప్పిళ్లై, మలి చిత్రం ఎంగేయుం కాదల్ హన్సికను నిరాశపరచాయి. అలా అపజయాలు వరుసగా పలకరిస్తున్నా సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి లక్ష్యాన్ని చేరుకున్న నటి హన్సిక. రేపు మహిళా దినోత్సవం ఈ సందర్భంగా అందాల తార హన్సికతో చిన్న భేటీ..

 
ప్రశ్న: మీది భయపడే స్వభవమా? ధైర్యశాలినా?
జవాబు: నాది భయపడే స్వభావం కాదు. అవసరం అయిన నిర్ణయాలను ధైర్యంగాను, మరికొన్ని విషయాలను నెమ్మదిగా ఆలోచించి తీసుకుంటాను.
 
ప్రశ్న: అయితే దేనికి భయపడరా?
జవాబు: ఎందుకు భయపడను. వెన్నుపోటు పొడిచే వాళ్లంటే భయం. అంతేకాదు బల్లి, బొద్దింకలన్నా భయమే.
 
ప్రశ్న: పురుషుల్లో నచ్చే అంశాలు, నచ్చని విషయాలు?
జవాబు: స్త్రీలను గౌరవించే పురుషులంటే ఇష్టం. ఆడవాళ్లకు స్వేచ్ఛనిచ్చే మగవారన్నా గౌరవం. మహిళలను బానిసలుగా చూసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు. పురుషులు ఆత్మ విశ్వాసం నచ్చుతుంది. తమకే సాధ్యం అనే వాళ్ల గర్వం నచ్చదు.
 
ప్రశ్న: ఒక ప్రముఖ నటి స్థాయి మీకు సాధకమా? బాధకమా?
జవాబు: జీవితంలో ఇతరులకు దక్కని పేరు, ప్రతిష్టలు తారలకు దక్కడం సాధకంగానే భావిస్తాను. వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో సమస్యలన్నీ బాధాకరమే కదా? అయితే ఒక ప్రముఖ నటిగా అలాంటి వాటిని సహించాల్సిందే.
 
ప్రశ్న: మహిళగా సమాజానికి మీరేదైనా చేయాలనుకుంటున్నారా?
జవాబు:
మహిళలకు మర్యాదను ఆపాదించేలా నడచుకోవడమే స్త్రీ సమాజానికి చేసే సేవ అవుతుంది. ఒక స్త్రీ తన కుటుంబం పై శ్రద్ధచూపడంతో పాటు సమాజాన్ని గమనించాలన్నది నా భావన. సమాజానికి కావలసిన ప్రేమాభిమానాలను పంచాలి. అలా చేస్తే సగం సమస్యలు తగ్గిపోతాయని భావిస్తున్నాను. ఇది ఒక్క స్త్రీలకు మాత్రమే సాధ్యం.
 
ప్రశ్న:మిమ్మల్ని చిన్న కుష్భు అని కోలీవుడ్ వర్గాలు పిలుచుకుంటున్నారు. ఆమె మాదిరిగానే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా?
జవాబు:
నాకు రాజకీయాలొద్దు. సినిమాలు చాలు. నాకు అర్థం కాని వాటిలో రాజకీయాలొకటి. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు షూటింగ్‌లు, ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జిమ్, ఆ తరువాత ఆనందంగా నిద్రకు ఉపక్రమించడం ఈ జీవితం చాలు. రాజకీయాల్లో కొచ్చే సేవ చేయాలన్న విషయాన్ని తాను సమర్థించను. ముంబయిలోని వాడ ప్రాంతంలో అనాథలకు, వృద్ధుల కోసం ఆశ్రమం నిర్మిస్తున్నాను. సినిమాల్లో సంపాదించిన డబ్బును అనాథలకు, వృద్ధులకు పరిరక్షించడానికి వెచ్చించడం సంతృప్తిగా ఉంది.
 
ప్రశ్న:ప్రశ్న : ఆడజన్మ ఎత్తినందుకు గర్వ పడుతున్నారా? చింతిస్తున్నారా?
జవాబు:
నిజం చెప్పాలంటే గర్వపడడంతో పాటు చాలా సంతోషిస్తున్నాను. సమాజంలో పలు మార్పులకు స్త్రీ మూర్తులే కారణం. మాతృమూర్తి వలనే మానవ జాతి వృద్ధి చెందగలదు. స్త్రీలు గర్వపడడానికి ఈ ఒక్క అంశం చాలు. అది గాక ఆడజన్మకు చింతించాల్సిన విషయం ఏమీ లేదు.
 
ప్రశ్న: సినీ తారలు ముఖాలను మార్ఫింగ్ చేస్తూ అశ్లీల దృశ్యాలను సోషల్ నెట్‌వర్క్సులో ప్రసారం చేసే వాళ్లకు ఎలాంటి శిక్ష విధించాలంటారు?
జవాబు: ఇది చాలా చింతించాల్సిన విషయం. సినీ తారలుగా తాము ఆడంబర జీవితాలను అనుభవిస్తున్నాం అనే చాలామంది అపోహ పడుతుంటారు. నిజం ఏమిటంటే తాను 365 రోజులు శ్రమిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాం. అలాంటి తమను కించపరిచే చర్యలకు పాల్పడడానికి ఎలా మనసు కలుగుతుందో అర్థం కావడం లేదు. మార్ఫింగ్‌తో అశ్లీల దృశ్యాలు ప్రసారం చేయడం అనేది అత్యాచారం కంటే క్రూరమైన చర్య. తమ లాంటి వారిని మానసిక క్షోభకు గురి చేసే వారిని భగవంతుడే శిక్షించాలి.
 
ప్రశ్న: ఈ అంశంలో బాధితురాలైన మీరు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు?
జవాబు: ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదన్న విషయం అందరికీ తెలుసు. మరి ఇంకెందుకు ఫిర్యాదు చేయాలని అని హన్సిక ప్రశ్నించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement