![Sai Pallavi To Quit Film Industry Read What She Replied - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/8/sai.jpg.webp?itok=qCMbXF64)
తమిళసినిమా: సాయిపల్లవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజత్వంతో కూడిన నటనకు ఈమె చిరునామా. పరిచయమైన తొలి చిత్రం ప్రేమమ్‌తోనే టీచర్ పాత్రకు జీవం పోసి తనేంటో నిరూపించుకున్నారు. ఆ తరువాత గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో ఎక్కువగా చిత్రాలు చేయకపోయినా, తెలుగులో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రముఖ నటిగా రాణిస్తున్నారు. అయితే ఆమె గురించి అభిమానులు జీర్ణించుకోలేని వార్తలు ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సాయిపల్లవి నటనకు స్వస్తి పలికి వైద్య రంగంలో సేవలను అందించాలని నిర్ణయించుకున్నట్లు.. అందుకు ఒక ఆసుపత్రిని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. సాయి పల్లవి సినిమాల్లో నటించి చాలా కాలం అయ్యింది. తెలుగులో వచ్చిన కొన్ని అవకాశాలను ఆమె తిరస్కరించారు. గార్గీ చిత్రం తరువాత సాయి పల్లవిని తెరపై చూడలేదు. ఈ కారణంగానే ఆమెపై వదంతులు వస్తున్నాయి. ఈ సందర్భంగా సాయి పల్లవి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ఎంబీబీఎస్ చదివినా నటి కావాలని ఆశించానన్నారు. దీనికి తన ఆశను తల్లిదండ్రులు అడ్డుకోలేదన్నారు.
అందం అన్నది రూపంలో కాదని గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్ చిత్రంతో నటిగా తన సినీప్రయాణం ప్రారంభమైందని చెప్పారు. ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుందని ముందు ఊహించలేదన్నారు. అయితే ఆ చిత్రంలో టీచర్ ఇమేజ్‌ను మార్చడానికి వేరే తరహా పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. తాను నటించిన చిత్రాలు, తన పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలనే భావిస్తానన్నారు. తనను అందరూ తమ ఇంటి ఆడపడుచుగా భావించడం సంతోషంగా ఉందని అన్నారు. మంచి కథలు లభిస్తే భాషాభేదం లేకుండా నటించడానికి సిద్ధమని సాయి పల్లవి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment