ఇకనుంచీ అలా చేయదలుచుకోలేదు
‘‘ఇప్పటివరకు చేసినవాటిలో కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకోలేదు. ఇకనుంచీ అలా చేయదల్చుకోలేదు. మా నాన్నగారు ధనవంతులే. కానీ, నేను కాదు. ఇంకా ఆయన మీద ఆధారపడితే ఏం బాగుంటుంది? నాకూ కుటుంబం ఉంది కదా. అందుకే, మంచి పాత్ర, అందుకు తగ్గ పారితోషికం ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నా చేస్తా’’ అని లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చాణక్య బూనేటి నిర్మించిన ‘చందమామ కథలు’లో ఆమె నటించారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ -‘‘ఈ కథ విన్నప్పుడు ఇలాంటి సినిమా వదులుకుంటే, భవిష్యత్తులో మళ్లీ ఇంత మంచి అవకాశం రాదనిపించింది. ఎనిమిది కథలతో సినిమా అంటేనే చాలా కొత్తగా ఉందనిపించింది’’ అని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ -‘‘ఇందులో నాది గ్లామరస్‌గా ఉండే మోడల్ కేరక్టర్. ఈ మోడల్ సిగరెట్ కాలుస్తుంది.. మందు కొడుతుంది. వాస్తవానికి సిగరెట్ ఎలా పట్టుకోవాలో నాకు తెలియదు. దాంతో కొంతమందిని పరిశీలించాను. మందు కొట్టే సన్నివేశాలకు కూడా ఇతరులను అబ్జర్వ్ చేశాను. నా కేరక్టర్ మాట్లాడే మాటలు అక్కడక్కడా అభ్యంతరకరంగా కూడా ఉంటాయి. ‘ఇలాంటి డైలాగులా? కత్తెర పడుతుందేమో’ అని దర్శకుడితో అంటే, ‘ఈ కేరక్టర్ ఇలానే మాట్లాడాలి’ అన్నారు.
మోడల్‌గా చేయడం కోసం నేను హిందీ చిత్రం ‘ఫ్యాషన్’ని కొంత ఆదర్శంగా తీసుకున్నా’’ అని చెప్పారు. సిగరెట్, మందు తాగడం వంటి సన్నివేశాల్లో నటిస్తే, నెగిటివ్ ఇమేజ్ ఏర్పడే అవకాశం ఉండదా? అన్న ప్రశ్నకు -‘‘ఓ నటిగా ఎంతైనా చేయాలనే విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. విష్ణు, మనోజ్‌కి ఈ సన్నివేశాల గురించి తెలుసు. నాన్నగారికే తెలియదు. ఒకవేళ సినిమా చూసిన తర్వాత ‘ఎందుకిలాంటివి చేశావ్?’ అని అడిగితే ‘మీరే కదా డాడీ.. కళాకారులు ఏ పాత్రై నా చేయాలని అంటుంటారు’ అని కూల్ చేసేస్తా’’ అన్నారు. చందమామ కథలు’లాంటి మల్టీస్టారర్ చిత్రంలో నటించడంవల్ల మీకు ప్రాధాన్యం ఉంటుందంటారా? అని అడిగితే -‘‘మంచి సినిమాలో నాది చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు. చివరికి ఒక్క సన్నివేశంలో కనిపించినా చాలు. కాకపోతే, కథకు కీలకంగా ఉండాలి. ఈ సినిమాలో నా పాత్ర మాత్రమే కాదు.. అందరివీ బాగుంటాయి’’ అని చెప్పారు. తదుపరి సొంత సంస్థలో కొత్త దర్శకునితో ఓ సినిమా నిర్మించనున్నట్లు, అందులో తానే నటించనున్నట్లు లక్ష్మీ తెలిపారు.