
ఆమె కోరికను ధనుష్ తీరుస్తారా?
నటుడు ధనుష్, ఐశ్వర్యలది అన్యోన్య దాంపత్యజీవితం అని చెప్పడం అతిశయోక్తి కాదు.
నటుడు ధనుష్, ఐశ్వర్యలది అన్యోన్య దాంపత్యజీవితం అని చెప్పడం అతిశయోక్తి కాదు. భార్య భావాలను గౌరవించే ధనుష్ ముందు ఒక సంకటమైన అంశం నిలబడిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఐశ్వర్య ధనుష్ 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన విషయం తెలి సిందే. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా అంతకంటే ఎక్కువే ప్రాచుర్యాన్ని అందించింది. ఆ తరువాత దర్శకత్వం వహించిన ఐ రాజా వై చిత్రం కూడా అంతంత మాత్రంగానే ఆడింది. అయినా మంచి విజయం కోసం ఐశ్వర్యధనుష్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఒలింపిక్ చాంపియన్ మారియప్పన్ జీవిత కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈ విషయం అలా ఉంచితే నటుడు ధనుష్, శింబుల మధ్య వృత్తిరీత్యా గట్టి పోటీనే ఉందన్న విషయం తెలిసిందే.
అలాంటిది ఐశ్వర్య ధనుష్‌కు శింబు కథానాయకుడిగా ఒక చిత్రం చేయాలన్న కోరిక ఉందట. అందుకు కథ రెడీగా ఉన్నా, ఆయనకు కథ చెప్పడానికి సంకటపడుతున్నారట. వీరి కాంబినేషన్‌లో చిత్రం చేయడానికి ధనుష్ అనుమతి లభిస్తుందా? అసలు ఈ విషయాన్ని ధనుష్‌కు ఎలా చెప్పాలన్న సంశయంతో ఐశ్వర్య ఉన్నారట. అయితే ఇప్పటికే ఒక విషయంలో నటుడు శింబుకు తన మామ, సూపర్‌స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పడాన్నే ధనుష్ జీర్ణించుకోలేకపోతున్నారట. ఇలాంటి సమయంలో ఆయన భార్య ఐశ్వర్య శింబుతో చిత్రం చేస్తానంటే ధనుష్ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అయితే ఐశ్వర్య ధనుష్ నిజంగానే శింబు హీరోగా చిత్రం చేయాలని కోరుకుంటున్నారా అన్న సమాచారంలో నిజమెంత అన్నది ఆలోచించాల్సిన అంశం.