‘‘అ’ సినిమాతో నాని నిర్మాతగా మారి నేర్చుకున్నాడు.. ఇప్పుడు ‘హిట్’ అంటున్నాడు. ఎంత నమ్మకం లేకుంటే ఆ పేరు పెడతాడు. చాలా సినిమాలు చేశాడు కదా.. కొన్ని ఆడతాయి, మరికొన్ని ఆడవు. ఆడని వాటిలోని తప్పులు.. ఆడిన వాటిలోని బెస్ట్‌లు తీసుకుని ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ‘హిట్’ అని పేరు పెట్టే్టశాడు. మొత్తంగా ఓ డాక్టర్‌ని(శైలేశ్) డైరెక్టర్ చేశాడు నాని’’ అని డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు అన్నారు. ‘ఫలక్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా, రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అన్నది ఉపశీర్షిక. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.
ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి.. యూనిట్ ప్రమోషన్ ఐడియాలు కూడా కొత్తగా ఉన్నాయి. సినిమా మంచి హిట్ అవ్వాలి. ఉపశీర్షికలో ఫస్ట్ కేస్ అని పెట్టారు.. రెండో కేస్, మూడో కేస్ అంటూ దీనికి మరిన్ని ఫ్రాంచైజీలు రావాలి. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.
అనుష్క మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేను ఇక్కడికి అతిథిగా రాలేదు. నాని, ప్రశాంతి నా కుటుంబసభ్యులే. ‘అ’ చాలా మంచి సినిమా. రెండో సినిమా చాలా మంచి కథతో వస్తారనుకుని వేచి చూశా. ‘హిట్’ ట్రైలర్స్, పాటలు బాగున్నాయి’’ అన్నారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘హిట్’ సినిమా పెద్ద విజయం సాధించాలి. నాని హీరో అయినప్పటికీ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నాడు.. అలాంటి నాని బ్యానర్‌కి సక్సెస్ కావాలి’’ అన్నారు.
నాని మాట్లాడుతూ–‘‘హిట్’ సినిమాని తొలుత నేనే చేద్దామనుకున్నా.. విశ్వక్ అయితే బాగుంటుందనిపించింది. శైలేష్ చెప్పిన కథల్లో ‘హిట్’ వెంటనే తీయాలనిపించింది. డాక్టర్ ఉద్యోగం వదలొద్దని తొలుత చెప్పేవాణ్ణి.. ఈ రోజు చెబుతున్నా ఉద్యోగం వదిలేయ్.. పర్లేదు. ‘ఫలక్‌నుమాదాస్’లో విశ్వక్ ఆ పాత్రకు సరిపోయాడు.. ‘హిట్’ సినిమా చూశాక ఏ పాత్ర అయినా ఇరగదీస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒక్కరు విశ్వక్ సేన్.. మరొకరు సంగీత దర్శకుడు వివేక్ సాగర్. ‘అ’ సినిమా బాగున్నా డబ్బులు రాలేదేమో? అని కొందరు రాస్తుంటారు.. నిర్మాతగా నేను చెబుతున్నా. ఆ సినిమా పక్కా కమర్షియల్ హిట్. ఈ నెల 28న ప్రేక్షకులకు ‘హిట్’ రూపంలో ఓ క్వాలిటీ, మంచి సినిమా ఇస్తున్నాం.. ఇందుకు గర్వంగా ఉంది’’ అన్నారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రుహాని శర్మ మంచి నటి. ప్రశాంతిగారు సో స్వీట్. ఒకేసారి రెండు సినిమాలు చేయొద్దు.. ఒక్కొక్కటి చేస్తే ప్రశాంతంగా ఉంటుందని నాని అన్న సలహా ఇచ్చాడు.. అది ఎంతో ఉపయోగపడింది. శైలేష్‌గారు శాస్త్రవేత్తలాంటివాడు.. తెలివైనవాడు. ‘హిట్’ సినిమాకి నీళ్లు ఎక్కువ తాగి రాకండి.. వాష్‌రూమ్ వెళ్లే టైమ్ కూడా ఉండదు. ఇలాంటి థ్రిల్లర్ సినిమా తెలుగులో నేను చూడలేదు’’ అన్నారు.
శైలేశ్ కొలను మాట్లాడుతూ– ‘‘2017లో నానీ అన్నకి కథ చెప్పా.. విన్నాక ‘నువ్వే ఎందుకు దర్శకత్వం చేయకూడదు?’ అన్నారు. ఆ తర్వాత సిడ్నీ వెళ్లిపోయి డైరెక్షన్ నేర్చుకుని వచ్చి ఈ సినిమా తీశా. నన్ను దర్శకునిగా పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్స్ అన్న. ప్రశాంతి మేడమ్‌కి థ్యాంక్స్. విక్రమ్ రుద్రరాజు అని నేను రాసుకున్న పాత్రకి రెట్టింపు నటన ఇచ్చిన విశ్వక్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ చిత్రం బాగా రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకి థ్యాంక్స్’’ అన్నారు రుహాని శర్మ.
ఈ వేడుకలో నిర్మాత ప్రశాంతి, డైరెక్టర్ నందినీ రెడ్డి, హీరోలు రానా, నవదీప్, సందీప్ కిషన్, ‘అల్లరి’ నరేశ్, సునీల్, కార్తికేయ, నటి మంచు లక్ష్మి, నటులు భానుచందర్, రాహుల్ రామకృష్ణ, రవివర్మ, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకులు కీరవాణి, వివేక్ సాగర్, కాలభైరవ, కెమెరామేన్ మణికంద¯Œ , ఎడిటర్ గ్యారీ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు.
హిట్ ఇస్తున్నందుకు గర్వంగా ఉంది
Published Mon, Feb 24 2020 12:24 AM | Last Updated on Mon, Feb 24 2020 4:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment