హీరోకు చేదు అనుభవం.. కారుపై దాడి
సాక్షి, బెంగళూరు : సినీనటులు జనాల్లోకి వస్తే ఆనందోత్సవాలతో అభిమానులు బ్రహ్మరథం పడుతారు. అది సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ కూడా అలాగే జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు అదే అభిమానం ఆగ్రహంగా మారితే హీరోలకు చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో చోటుచేసుకుంది. కన్నడ హీరో యశ్ ఆలస్యంగా రావడంతో ఆగ్రహం చెందిన అభిమానులు, గ్రామస్థులు ఆయన కారును సోమవారం రాత్రి ధ్వంసం చేశారు.
యాదగిరి జిల్లాలోని సురపుర గ్రామంలో కరువు బారిన పడ్డ రైతులను పరామర్శించడానికి యశ్ సోమవారం మధ్యాహ్నం గ్రామానికి రావాల్సివుంది. అయితే కొన్ని కారణాల వల్ల యశ్ రాత్రి 9 గంటలకు కూడా రాలేదు. అప్పటి వరకు యశ్ రాక కోసం కొండంత ఆశతో ఎదురు చూసిన అభిమానులు, ప్రజలు ఆయన రావడం మరింత ఆలస‍్యం కావడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పది గంటల దాటిన తర్వాత వచ్చిన హీరో కారుపై గ్రామస్తులు ఒక్కసారిగా దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. దీంతో హీరో యశ్ ఒక్కసారిగా కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చివరకు ఆలస్యానికి గల కారణాలను యశ్ వివరించడంతో గ్రామస్తులు శాంతించారు.