హీరోల చిత్రాలు చేస్తున్న దర్శకుడు
సాధారణంగా స్టార్ హీరోలతో చిత్రాలు చెయ్యాలని యువ దర్శకులు కోరుకుంటారు. దర్శకుడు పాండిరాజ్ మాత్రం హీరోలు నిర్మించే చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ తన రూటు సపరేటు అనిపించుకుంటున్నారు. పసంగ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన ఈయన తొలి చిత్రంతోనే జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాత వంశం, కేడీ బిల్లా కిల్లాడి రంగా, మెరీనా తదితర సక్సెస్‌పుల్ చిత్రాలను తెరకెక్కించి గుర్తింపు పొందారు.
ప్రస్తుతం శింబు, నయనతార జంటగా ఇదు నమ్మ ఆళు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి శింబు నిర్మాత. పాండిరాజ్ తొలి చిత్రం పసంగ చిత్రానికి నటుడు శశికుమార్ నిర్మాత. తాజాగా ప్రముఖ సూర్య నిర్మించనున్న చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఒక సున్నితమైన కథాంశంతో బాలతారలు ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చిత్రా న్ని నటుడు సూర్య తన 2డి ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్.
సూర్య కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శింబు, నయనతార నటిస్తున్న ఇదు నమ్మ ఆళు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న పాండిరాజ్ తదుపరి సూర్య నర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. తొలుత నటుడు శశికుమార్, తాజాగా శింబు, తదుపరి సూర్య ఆ తర్వాత ఏ హీరో నిర్మించే చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించనున్నారోనన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.