జనం మెచ్చేది జానపదాలనే!
జనం మెచ్చేది జానపదాలనే!
Published Tue, Oct 22 2013 12:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM
న్యూఢిల్లీ: 1990లలో పాప్ సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫాల్గుణి పాఠక్ ప్రేమ, దాండియా గేయాలతో యువతరాన్ని మంత్రముగ్ధులను చేసిందని చెప్పుకోవచ్చు. మనదేశంలో జానపద గీతాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఈమె చెబుతోంది. ముంబైలోని నవరాత్రి ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్న ఈ 42 ఏళ్ల గాయని ‘ఇంద్ర మెరువ గయి’, ‘చమ్ చమ్ పాయలియా’ వంటి గేయాలతో వీనుల విందు చేసింది. ‘పాప్ గేయాలకంటే జానపద గీతాలకు ఆదరణ ఎక్కువ ఉంటుందన్నది నిజం. అందుకే మేం జానపద గీతాలను ఎంచుకుంటాం. అవి సహజమైనవి కాబట్టి ఆనందాన్ని పంచుతాయి.
నాకు కూడా జానపద గీతాలు చాలా ఇష్టం’ అని పాఠక్ వివరించింది. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల్లో ఇటీవలే ముగియడం తెలిసిందే. ఆ సమయంలో పాఠక్ తీరిక లేకుండా గడిపింది. ముంబై ఘాట్కోపర్‌లోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఈమె పాడిన దాండియా గేయాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. మంగల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
1990లలో పాఠక్ గొంతు నుంచి వెలువడిన ‘యాద్ పియా కీ ఆనే లగీ’ ‘మైనే పాయల్ హై చన్కాయి’, ‘మేరీ చూనర్ ఉడ్ ఉడ్ జాయే’ వంటి ప్రేమగీతాలు యువతరాన్ని ఓలలాడించాయి. ‘మా బృందసభ్యులందరి సమష్టి కృషి వల్లే నేను విజయం సాధించాను. నా గొంతు టీనేజ్ యువతిలా ఉంటుందని మా సంగీత దర్శకుడు చెప్పేవాడు. అందుకే అన్ని పాటలనూ నాతోనే పాడించేవాడు’ అని పాఠక్ తెలిపింది. అంతేకాదు.. ఈమె మరోసారి జానపద గీతాల ఆల్బమ్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది వచ్చే ఏడాది విడుదలవుతుంది. అంతే పాఠక్ అభిమానులకు మరోసారి పండగ అన్నమాటే!
Advertisement
Advertisement