హన్సికతో సంబంధం లేదు!
కొందరి ప్రేమలు మూణ్ణాల ముచ్చటగా మిగిలిపోతాయి. శింబు, హన్సికల ప్రేమాయణం కూడా ఈ జాబితాలోకే వస్తుంది. ‘మేం ప్రేమలో పడ్డాం’ అని ఒకేరోజున ఇద్దరూ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే విడిపోయారు. ఆ మధ్య హన్సిక ‘సాక్షి’తో మాట్లాడుతూ.. శింబూ నుంచి తను విడిపోయిన విషయాన్ని స్పష్టం చేశారు. బుధవారం శింబు ట్విట్టర్ ద్వారా తమ బ్రేకప్‌ని నిర్ధారించారు. ‘‘ఈ బంధం చాలనిపించింది.
బాగా ఆలోచించుకున్న తర్వాత ఇక సింగిల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. హన్సికతో, ఆమెకు సంబంధించిన విషయాలతో నాకెలాంటి సంబంధం లేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాల గురించి చర్చించాలనుకోవడంలేదు. నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు స్పష్టం చేయాలనే ఈ ప్రకటన చేశాను. గతం గతః. గతాన్ని తల్చుకుని ఎప్పుడూ బాధపడను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను’’ అని శింబు వెల్లడించారు.