
‘‘కిరాక్ పార్టీ’ చిత్రంలో నా పాత్ర పేరు మీరా. ఎంతమంది అబ్బాయిలు వెంట పడ్డా పట్టించుకోని పాత్ర. కన్నడలో ఈ పాత్రను రష్మికా చేశారు. నేను ఆమెను ఫాలో కాకుండా దర్శకుడు చెప్పినట్టు కొత్తగా చేశా. నిఖిల్ నన్నెప్పుడూ కొత్త హీరోయిన్‌ని చూసినట్టు చూడలేదు. చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. టైటిల్‌కి తగ్గట్టుగానే మంచి పార్టీలా ఉంటుంది’’ అని కథానాయిక సిమ్రన్ అన్నారు. నిఖిల్, సిమ్రన్, సంయుక్త హెగ్డే హీరో హీరోయిన్లుగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిరాక్ పార్టీ’ ఈరోజు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా సంయుక్త హెగ్డే మాట్లాడుతూ– ‘‘కన్నడ ‘కిరిక్ పార్టీ’లో నేను నటించా. నా పాత్ర నచ్చి దర్శక–నిర్మాతలు ‘కిరాక్ పార్టీ’కి తీసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా విషయంలో నాకు నేనే పోటీ. నా పాత్ర పేరు సత్య. ఫన్ లవింగ్ బబ్లీ గర్ల్. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న పాత్ర ఇది. మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అందులోని ట్విస్ట్ ఏంటన్నది సినిమాలో చూడాలి. తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నా. తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇంకా ఏదీ అంగీకరించలేదు. ‘కిరాక్ పార్టీ’ విడుదలయ్యాక చూడాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment