ఎగతాళి చేస్తారనే ఆ సినిమా చేయలేదు
బాలీవుడ్‌లో గోవిందాకి ఉన్న నిక్‌నేమ్ ఏంటో తెలుసా? ‘లేట్ కమర్’. ఎప్పుడైనా గోవిందా షూటింగ్‌కి తొందరగా వస్తే.. అందరూ ఆశ్చర్యపోయేవాళ్లట. దాన్నిబట్టి దర్శక, నిర్మాతలకు ఆయన ఏ స్థాయిలో చుక్కలు చూపించేవారో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే గోవిందాకు సినిమాలు తగ్గిన దాఖలాలున్నాయి. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన నటించిన ‘కిల్ దిల్’ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా గోవిందా మాట్లాడుతూ -‘‘ఒకప్పుడు నేను ఆలస్యంగా షూటింగ్స్‌కి హాజరైన మాట వాస్తవమే. అయితే, అది పొగరుతో చేసింది కాదు. అప్పట్లో ఏ దర్శక, నిర్మాత అడిగినా కాదనలేక, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేవాణ్ణి. ఎక్కువ సినిమాలు ఒప్పుకోవడంతో ఒత్తిడి ఎక్కువై, షూటింగ్‌కి సకాలంలో హాజరు కాలేకపోయేవాణ్ణి’’ అన్నారు. ఇప్పటివరకూ గోవిందా వదులుకున్న చిత్రాల్లో ‘తాళ్’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కూడా ఉన్నాయి. ‘స్లమ్ డాగ్..’ని తిరస్కరించడానికి గల కారణం చెబుతూ -‘‘ఆ టైటిల్ నాకు నచ్చలేదు. టైటిల్ మార్చమని దర్శకుణ్ణి అడిగాను కూడా. అప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను. అందుకని ‘స్లమ్ డాగ్ వచ్చాడు’ అని ఎగతాళి చేస్తారనిపించింది. అందుకే, ఆ సినిమా వదులుకున్నా’’ అని చెప్పారు.