
గతేడాది అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ‘ఐకాన్- కనబడుటలేదు’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ మైండ్ ఫ్రెండ్, ఎమ్‌సీఏ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలిపారు. త్రివిక్రమ్, సుకుమార్‌లతో సినిమాల అనంతరం ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లనున్నట్టుగా చెప్పారు. బన్నీ కేరీర్‌లో 21వ చిత్రంగా దీనిని ప్రకటించారు. అయితే ఆ తర్వాత నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్‌డేట్ వెలువడలేదు.
ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు వేణు శ్రీరామ్.. పవన్ కల్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందని అనుకున్నారు. అయితే సరిగా ఏడాదికి అంటే.. ఈ ఏడాది బన్నీ బర్త్ డే సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చేసిన ట్వీట్ చూస్తే ఐకాన్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఐకాన్ టీమ్ తరఫును బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే గతేడాది ఏ పోస్టర్‌ను అయితే విడుదల చేశారో.. ఇప్పుడు కూడా అదే పోస్టర్‌ను పోస్ట్ చేశారు. అయితే పుష్ప చిత్రం పూర్తయిన తర్వాత ఐకాన్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.
అయితే కొంతకాలం కిందట వేణు శ్రీరామ్ పవన్ సినిమాతో బిజీగా మారడంతో ఐకాన్ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. గతంలో ఈ వార్తలను అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ ఖండించారు. ఐకాన్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని.. ఆ కథ బన్నీకి బాగా నచ్చిందని అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలిపారు. కాగా, ఐకాన్ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా తెలుస్తోంది.
Team #ICON wishes Stylish Star @alluarjun a Very Happy Birthday! #HappyBirthdayAlluArjun pic.twitter.com/jeRDhpc4zw
— Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2020