నిత్యామీనన్
నిత్యామీనన్‌కు పొగరెక్కువ. ఆమె దర్శక నిర్మాతలకు నిబంధనలు విధిస్తారు. నిర్మాతలను గౌరవించరు. అయితే మంచినటి. ఇది దక్షిణాదిలో నటి నిత్యామీనన్‌కు ఉన్న పేరు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే ఈ బ్యూటీ సొంతగడ్డపై అవకాశాలను కోల్పోయింది. అయితే టాలీవుడ్‌లో ఈమెకు సక్సెస్‌ఫుల్ నాయకి అనే పేరుంది. కోలీవుడ్‌లో ఇంతకుముందు వెప్పం, 180 చిత్రాల్లో నటించినా సక్సెస్ ఖాతాను ఓపెన్ చేయలేదు. తాజాగా నటిస్తున్న రెండు చిత్రాలపై ఈ బ్యూటీ కెరీర్ ఆధారపడి ఉంది. వాటిలో ఒకటి చేరన్ దర్శకత్వంలో శర్వానంద్‌కు జంటగా నటించిన జెకె ఎన్నుం నన్భనిన్ వాళ్కై, మరొకటి నటి శ్రీప్రియ రూపొందించిన మాలిని 22 పాళయం కోటై.
ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అయితే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో నిత్యామీనన్ గ్లామర్‌కు గేట్లు తెరిచినట్లు ప్రచారం మొదలైంది. ఈ తరహా ప్రచారాన్ని నిత్యామీనన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కథానాయికలు అందాలారబోయాలి, డ్యూయెట్లు పాడాలి అని మాత్రమే ఊహించుకోవద్దని చురకలంటించారు. వాటిని దాటి తన లాంటి వారికి ప్రతిభ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను మాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే నటిస్తానన్నారు. పాటలకు పరిమితం అయ్యే గ్లామర్ పాత్రలో నటించేది లేదని ఖరాఖండిగా చెప్పారు. తన వద్దకు వచ్చే దర్శక, నిర్మాతలకి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతానన్నారు. ఎవరికైనా తాను చెప్పిది ఒకటేనని కథ, తన పాత్ర నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తానని నిత్యామీనన్ పేర్కొన్నారు.