
ఆస్తులమ్మేస్తున్నా
నటి ఇలియానా ఆస్తులు అమ్ముకోవడానికి సిద్ధం అవుతోంది. తమిళంలో కేడీ చిత్రంతో పరిచయమైన నటి ఇలియానా. అయితే ఆ మధ్య విజయ్‌తో రొమాన్స్ చేసిన నన్బన్ చిత్రంతో పాపులర్ అయ్యింది. అదే ఆమె చివరి తమిళ చిత్రం కూడా. అంతకు ముందు తెలుగులో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ గోవా సుందరి ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి సారిస్తోంది. బర్ఫితో హిందీ చిత్ర సీమలో ప్రవేశం చేసిన ఇలియానాకు అక్కడ పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో అక్కడే సెటిల్ అయ్యింది. ముంబాయిలో ఇల్లు కూడా కొనుక్కొన్న ఇలియానా, అంతకు ముందు ఆంధ్రాలో కొనుగోలు చేసిన బంగ్లా, ఇతర స్థిరాస్తులను ఇప్పుడు విక్రయించాలని నిర్ణయించుకుందట.
హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతాల్లో ఇలియానా సొంతంగా అందమైన భవనాన్ని కొనుక్కున్నారు. ఈ భవనాన్ని అప్పట్లో ఈమె కోటిన్నరకు కొనుక్కున్నారు. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోవడంతో అక్కడి ఆస్తుల విలువ తగ్గిపోతుందనే సమాచారాన్ని కొందరు ఇలియానాకు చేరవేయడంతో ఆమె తన ఆస్తుల్ని విక్రయించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇలియానా ఆస్తుల విక్రయం వ్యవహారం గురించి ఆమె తల్లి రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.