నేను విలన్‌ని కాదు!
‘రాముడు మంచి బాలుడు’ అన్నట్లుగా... తాప్సీని మంచి బాలిక అనవచ్చు. పార్టీలు చేసుకోవడం, విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం, ఎలా పడితే అలా ఉండడం తాప్సీకి నచ్చదు. అలాంటి తాప్సీ జూదశాలలోకి అడుగుపెట్టారు. పందెం కట్టారు. అయితే, ఇదంతా సినిమా కోసమేలెండి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘వై రాజా వై’లో ఇలాంటి పాత్ర చేస్తున్నారు తాప్సీ. దాంతో ఈ చిత్రంలో ఆమె ప్రతినాయికగా నటిస్తున్నారనే వార్త ప్రచారం అవుతోంది.
దీని గురించి తాప్సీ స్పందిస్తూ -‘‘ఇందులో నా పాత్ర పేరు శ్రేయ. జీవితాన్ని ఆస్వాదించాలనుకునే మనస్తత్వం తనది. జూదశాలలకు వెళుతుంది. డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెడుతుంది.తన జీవితం తనది. అంతే కానీ, ఈ సినిమాలో హీరో కారణంగా లాభపడటమో, విలన్ వల్ల నష్టపోవడమో ఉండదు. నేను మాత్రం విలన్ కాదు. నిజం చెప్పాలంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని జూదశాలల్లో పోగొట్టుకోవడం నాకిష్టం ఉండదు. నా మనస్తత్వానికి విరుద్ధమైన పాత్రను ఇందులో చేశాను. నాది అతిథి పాత్ర. తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర’’ అని చెప్పారు.