ఇమైకా నొడిగళ్ చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: అధర్వ, నయనతార, విజయ్‌సేతుపతి, రాశీఖన్నా, హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖ నటీనటులు నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇమైకా నొడిగళ్ భారీ అంచనాల మధ్య ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. క్యామియో ఫిలింస్ పతాకంపై సీజే. జయకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి డిమాంటీ కాలనీ చిత్రం ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. హిప్‌హాప్ తమిళా సంగీతాన్ని, ఆర్‌డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్ర వివరాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ బుధవారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సీఏ.జయకుమార్ మాట్లాడుతూ ఇది మల్టీస్టారర్ చిత్రం అని, రెండేళ్ల కఠిన శ్రమ, అవమానాలను దాటి ఈ నెల 30వ తేదీన విడుదల కానుందన్నారు. చిత్రంపై దర్శకుడి నమ్మకంతో విడుదలకు ఐదు రోజుల ముందు పత్రికల వారికి ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నామన్నారు.
ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హిందీ నటుడు అనురాగ్ కశ్యప్ నటన యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందన్నారు. అదే విధంగా అధర్వ, రాశీఖన్నాల జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందని చెప్పారు. ఇక విజయ్‌సేతుపతి, నయనతారల సన్నివేశాలు అందరిని కంటతడి పెట్టిస్తాయని అన్నారు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తాము ఎలాంటి కాంప్రమైజ్ కాలేదన్నారు. పోరాట దృశ్యాలకు అవసరమైన వాటిని నిర్మాత నుంచి ఎలా అడిగి తీసుకోవాలో ఫైట్ మాస్టర్ స్టన్ శివకు బాగా తెలుసన్నారు. హిప్‌హాప్ తమిళా నేపథ్య సంగీతంతో కలిపి చిత్రాన్ని చూడడానికి తానూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నిర్మాత అన్నారు. చిత్ర కథానాయకుడు అధర్వ మాట్లాడుతూ ఇమైకా నొడిగళ్ రోలర్ కోస్టర్ రైడ్ కంటే కష్టమైనదని, ఏమైనా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చేయాలని తాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు భావించామని అన్నారు. చాలా శ్రమ తరువాత నిర్మాత జయ్‌కుమార్ ఈ చిత్రంలోకి వచ్చారని తెలిపారు.ఆయన కథను నమ్మి ఖర్చు పెట్టారని తెలిపారు. నయనతార, అనురాగ్ కశ్యప్, ఛాయాగ్రాహకుడు ఆర్‌డీ.రాజశేఖర్ అంటూ తన ఫేవరేట్స్ లిస్ట్‌లో ఉన్న వారందరూ ఈ చిత్రంలో పనిచేయడం పెద్ద సర్‌ప్రైజ్ అని అన్నారు. ఈ చిత్ర ఆల్బమ్ తనకు చాలా నచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో పోరాట దృశ్యాల్లో నటించడం మరచిపోలేని అనుభవం అని అధర్వ పేర్కొన్నారు. రాశీఖన్నా, సంగీతదర్శకుడు హిప్ హాప్ తమిళ, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment