మన మార్కెట్ రేంజ్ పెరుగుతుంది!
‘‘మనదేశంలోనే అతి పెద్ద సినిమా పండుగ ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’. ఈ ఏడాది నుంచి ఈ వేడుకకు హైదరాబాద్ శాశ్వత వేదిక కావడం గర్వకారణం. ఔత్సాహికులకు నటనలో శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కోసం స్థల సమీకరణ జరుగుతోంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సినీ రంగంలోని అన్ని శాఖల వారినీ ఒకే చోటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నెల 24 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని ఆర్.ఎఫ్.సిలో ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ జరగనుంది. ఈ వేడుక నిర్వహణ విషయమై ‘కార్నివాల్’ ఫౌండర్ డెరైక్టర్, ఎరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సి.ఇ.ఓ అయిన సోహన్ రాయ్‌తో, తెలుగు సినీ ప్రముఖులతో కలసి హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో తలసాని అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో మంత్రి చర్చించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ- ‘‘ఈ వేడుక నిర్వహణకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వ సహకారం, ఇక్కడి మౌలిక వసతులు, రవాణా సదుపాయాలే. ‘కార్నివాల్’ ఇక్కడ నిర్వహించడం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమ మార్కెట్ రేంజ్ పెరుగుతుంది’’ అని పేర్కొన్నారు. సోహన్ రాయ్ మాట్లాడుతూ- ‘‘ఈ వేడుకను ఫస్ట్‌టైమ్ కోచ్చిలో నిర్వహించాం.
తెలంగాణ ప్రభుత్వ విధాన నిర్ణయాలు, సహకారంతో హైదరాబాద్‌ను శాశ్వత వేదిక చేయనున్నాం. దేశంలో నిర్మించిన చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ వేడుక నిర్వహిస్తున్నాం. సుమారు 75 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు, ఇరవై వేల మంది సందర్శకులు హాజరవుతారు. 200కి పైగా స్టాల్స్‌తో మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు, నిర్మాత సి.కల్యాణ్, ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.