అధరములను మధుర ఫలములవలె...
సందర్భం నేడు పపంచ ముద్దుల దినోత్సవం
నవ్వులు నానా రకములు!
ప్రేమలు పలు విధములు!!
అదే రీతిన ముద్దులు కూడా సకల రూపములు!!!
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే రీతిలో
ముద్దులందు మోహ ముద్దులు వేరు.
ముద్దంటే? పెదవులతో రాసే పొయిట్రీ.
ముద్దంటే? శృంగార సౌధానికి చేసే శంకుస్థాపన.
ముద్దంటే? గుండెల్లో ఘనీభవించిన ప్రేమను ద్ర(ధృ)వీకరించుకునే ప్రయత్నం. ఇదంతా చూస్తుంటే... అధరాలక్కూడా అయస్కాంత శక్తి ఉందేమో అనిపిస్తుంది.
ముద్దుతో కవిత్వం తన్మయత్వం పొందినట్టుగానే, ముద్దుతో వెండితెర పరవళ్లు తొక్కే పరిమళ సంద్రమయ్యింది. ఒకప్పుడు వెండితెరపై ముద్దు అనేది పరమ నిషిద్దం. ఇప్పుడది బాక్సాఫీస్‌కి బంగారు బాతు. ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’లో శ్రీదేవి అన్నట్టుగా - నాయకా నాయికలు తమ అధరములను మధుర ఫలముల వలె కొరుక్కుతినడం ఇప్పుడు ‘కామ’న్. బాలీవుడ్‌లో ఈ లిప్‌లాక్‌లనేవి ఆటోమేటిక్ లాక్ వేసినంత సులభము, సునాయాసము.
టాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి.
ఎన్ని ఉదాహరణలని చెప్పాలి?
ఎంత చరిత్ర అని తవ్వి తీయాలి.
ఫైనల్‌గా ఈ ‘కిస్’కిందకాండ ప్రేక్షకులకు నయనానందకాండ!
తొలి తెలుగు సినిమా ముద్దు
చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. మనకు స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే విడుదలైన ‘గొల్లభామ’ సినిమాలో లిప్‌లాక్ సీన్ ఉంది. ప్రముఖ నటి అంజలీదేవి తొలి సినిమా అది. అంజలీదేవి, ‘ఈలపాట’ రఘురామయ్యపై ఈ ముద్దు సన్నివేశం చిత్రీకరించారు. సెన్సార్‌వారు అభ్యంతరం వ్యక్తం చేస్తే, అది నిజమైన ముద్దు దృశ్యం కాదని, ఎడిటింగ్‌లో చేసిన మేజిక్ అని చెప్పి తప్పించుకున్నారట ఆ చిత్ర దర్శక, నిర్మా తలు. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఇలాంటి బ్లాస్ట్‌లు చాలా జరిగాయి మరి!
తొలి భారతీయసినీ చుంబనం
1933లో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కర్మ’ అనే సినిమా వచ్చింది. అందులో హీరో హీరోయిన్లు హేమాంశురాయ్, దేవికారాణి. వీరిద్దరిపై ఓ సుదీర్ఘ చుంబన దృశ్యం చిత్రీకరించారు. అప్పట్లో అది సూపర్ సెన్సేషన్. భారతీయ వెండితెరపై ఈ రీతిన ముద్దు దృశ్యాన్ని చిత్రీకరించడం ఇదే ప్రథమం.