నేను చేసిన సాహసం అదే! : ప్రవీణ్ సత్తారు
తొలి సినిమా ‘ఎల్బీడబ్ల్యూ’తోనే మంచి దర్శకునిగా మార్కులు కొట్టేశారు ప్రవీణ్ సత్తారు. రెండో సినిమా ‘రొటీన్ లవ్‌స్టోరి’ని భిన్నమైన ప్రేమకథగా ఆవిష్కరించి ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించేశారు. ఆయన మూడో సినిమా ‘చందమామ కథలు’ విడుదలైంది. ఇదో కథామాలిక. సమకాలీన సమాజంలో... పొంతనలేని ఎనిమిది కథల సమాహారం ఈ సినిమా. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమా ప్రశంసలందుకుంటోందని ప్రవీణ్ ‘సాక్షి’తో ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ సత్తారుతో కాసేపు...
ఈ సినిమా విషయంలో మీకు లభించిన గొప్ప ప్రశంస?
చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అభినందిస్తున్నారు. తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందని కలలో కూడా అనుకోలేదని చాలామంది అంటున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఈ చిత్రం చూశారు. విజయనిర్మలగారైతే క్లయిమాక్స్‌లో కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో సినిమా తీయడం కష్టమని అభినందించారు.
అసలు ఇలాంటి సినిమా తీయాలని ఎందుకనిపించింది?
తెలుగులో కొత్త సినిమాలు రావడం లేదు, తీసిన సినిమాలే మళ్లీ తీస్తున్నారనే విమర్శ ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అందుకే... తెలుగుతెరకు ఓ కొత్త సినిమా ఇవ్వాలనే కసితో ఈ సినిమా చేశాను.
నిజంగా ఇలాంటి కథనంతో సినిమా తీయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏమైనా హోమ్‌వర్క్ చేశారా?
ఇలాంటి సినిమాలు తీయాలంటే పరిశీలన అవసరం. లేచినప్పట్నుంచీ పడుకునే వరకూ జీవితంలో ఎన్నో రకాల మనుషుల్ని చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యక్తిత్వం. సినిమాల్లో డ్రామా అవసరం అని చాలామంది అంటుంటారు. నిజానికి సమాజంలో మనకు కనిపించే పాత్రల్లో ఉండే డ్రామా ఏ సినిమాలో కనిపించదు. కాకపోతే దాన్ని తెరపై ఆవిష్కరించడం చేతకావాలి. ‘చందమామ కథలు’ విషయంలో నేను చేసిన సాహసం అదే.
అంటే... అందులోని పాత్రలు రియల్ లైఫ్‌లో మీరు చూసినవేనా?
అవును... పలు సందర్భాల్లో నేను గమనించిన పలువురు వ్యక్తులే ఈ సినిమాలోని పాత్రలకు ప్రేరణ. ఉదాహరణకు ఖైరతాబాద్ జంక్షన్‌లో కేవలం రాత్రి వేళల్లోనే ఓ ముసలాయన అడుక్కుంటూ ఉంటాడు. అతను పగలు కనిపించడు. కారణం పొల్యూషన్. దాని కారణంగా ఆరోగ్యం పాడవుతుందని అతని ఫీలింగ్. ఆ ముసలాయనకు చింతల్ బస్తీలో మూడంతస్తుల బిల్డింగ్ ఉంది. దాని అద్దెలు కూడా అతనికి భారీగానే వస్తుంటాయి. కేవలం బెగ్గింగ్ వల్ల వచ్చిన డబ్బుతోనే ఆ ముసలాయన ఆ బిల్డింగ్ కొన్నాడు. ‘చందమామ కథలు’ చిత్రంలోని బెగ్గర్ పాత్రకు ప్రేరణ అయనే. అలా ప్రతి పాత్రకూ ఓ ప్రేరణ ఉంది.
విదేశాల్లో మంచి ఉద్యోగం, చేతినిండా సంపాదన ఉన్న మీకు సినిమాలపై మీ దృష్టి ఎందుకు మరలింది?
నాకు సినిమాలంటే ప్రాణం. ముఖ్యంగా కె.విశ్వనాథ్‌గారి అభిమానిని. ఆయన తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సినిమాలు తీసే దర్శకులు నాకు ఎవ్వరూ కనిపించలేదు. మంచి సినిమా అంటే... మలయాళం, హిందీ, తమిళ సినిమాలవైపే అందరూ చూస్తున్నారు కానీ, తెలుగు సినిమా వంక ఒక్కరు కూడా చూడటం లేదు. అందుకే... నా వంతు ప్రయత్నంగా తెలుగులో మంచి సినిమాలు తీయాలనే తలంపుతో దర్శకుణ్ణయ్యాను.
అంటే... మున్ముందు కూడా మీ నుంచి ఇలాంటి సినిమాలే వస్తాయన్నమాట?
ఒక మంచి ప్రయత్నం చేస్తే సరిపోదు. దానికి ప్రజాదరణ కూడా ముఖ్యం. ‘చందమామ కథలు’ అనే మంచి సినిమా తీశాను. అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ మెచ్చుకోళ్లతో పాటు డబ్బులు కూడా రావాలి. అలా వస్తే... మరిన్ని మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది.
స్టార్ హీరోలతో సినిమాలు చేయరా?
ఎందుకు చేయను... తప్పకుండా చేస్తాను. అయితే వాళ్లకి అనుగుణంగా చేయమంటే మాత్రం చేయలేను. నా శైలిలో నన్ను చేయనిస్తే స్టార్లతో కూడా చేస్తాను.