గౌతమ్ కల నెరవేరనుందా?
‘‘రజనీకాంత్‌తో సినిమా చేయాలనే ఆకాంక్ష ఎప్పట్నుంచో ఉంది. డబ్బులు కోసమో, పేరు కోసమో కాదు.. దర్శకుడి మేకింగ్‌ని లక్షలాది మంది చూస్తారు. అది చాలు. సింగిల్ ట్రైలర్ కూడా విడుదల చేయకుండా సినిమాని విడుదల చేసినా జనాలు థియేటర్‌కి వస్తారు’’ అని ఓ సందర్భంలో దర్శకుడు గౌతమ్ మీనన్ అన్నారు. పలు అనువాద చిత్రాల ద్వారా సుపరిచితుడై, ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావె’ వంటి స్ట్రైట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన గౌతమ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు సిద్ధమైంది.
ప్రస్తుతం ధనుష్ హీరోగా తమిళంలో ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారాయన. తదుపరి సినిమా అతని మామగారు రజనీతో చేయనున్నారని చెన్నై టాక్. రజనీ కోసం గౌతమ్ ఓ స్క్రిప్ట్ రెడీ చేసే పని మీద ఉన్నారట. ప్రస్తుతం రజనీ ‘2.0’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత గౌతమ్ దర్శకత్వంలోనే ఆయన సినిమా చేయనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం ఆరంభమవుతుందట!