
ఇది మా అందరికీ గుణపాఠం: సీనియర్ హీరో
నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, వాటిపై రేగిన దుమారం తామందరికీ ఒక గుణపాఠమని, నటీనటులంతా దీన్ని గుర్తించాలని సీనియర్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రతినిధి నరేష్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చాలావరకు జోకులతోనే కొనసాగుతాయని, కానీ కొంతమంది నటులు హాస్యానికి, అవసరం లేని వ్యాఖ్యలకు మధ్య ఉండే చిన్న మంచుపొరను గుర్తించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని అన్నారు.
ఏదో ఉత్సాహంలో ఒక మాట మాట్లాడటం, అది సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావడం గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉందని చెప్పారు. అందువల్ల నటీనటులు సంయమనం పాటించడం అవసరమని ఆయన తెలిపారు. వ్యక్తిగత జీవితంలో ఎవరు ఎలా ఉన్నా వాళ్ల ఇష్టమని, అయితే సభలో ఉన్నప్పుడు మాత్రం అలా జరగకుండా చూసుకోవడం తమ అందరి బాధ్యత అని చెప్పారు.