
ఇది నా ఇండియా కాదు: ఏఆర్ రెహ్మాన్
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాక్షి, ముంబై: ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య పై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గౌరీలంకేష్ హత్య తనని చాలా బాధించిందని, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదని ఆకాంక్షించారు. ఒకవేళ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అది తన భారతదేశం కాదన్నారు. భారత్ అంటే దయాగుణానికి, శాంతికి చిహ్నం అని, తనకు అలాంటి భారతదేశం కావాలన్నారు.
రెహ్మాన్ తాజాగా సంగీతం ప్రధానాంశంగా వన్ హార్ట్ సినిమాను తెరకెక్కించారు. సాధారణ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని తెలిపారు, యాక్షన్, శృంగారం, కామెడీ ఉన్న మూసధోరణి చిత్రాలకు ప్రత్యామ్నాయంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. సంగీతం గురించి తెలుసుకోవాలనుకొనే, కొత్తదనం కోరుకునే ప్రేక్షకుడు వన్ హార్ట్ సినిమాను చూడాలని కోరారు.