
మమ్మీ రిటర్న్స్
సరిగ్గా 51 ఏళ్ల క్రితం నాటి సంఘటన ఇది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో ‘తేనె మనసులు’ తీయాలను కున్నారు. లుక్ టెస్ట్‌కి చాలామంది వచ్చారు. వాళ్లల్లో హేమమాలిని ఒకరు. ఆదుర్తి ఆమెను రిజక్ట్ చేశారు. ఇది జరిగింది 1965లో. అదే ఏడాది ‘పాండవ వనవాసం’లో ఒక పాటకు నర్తించారు హేమమాలిని. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో నాయికగా చేసి, ‘డ్రీమ్ గాళ్’ అయ్యారు.
‘పాండవ వనవాసం’లో కనిపించిన ఐదేళ్లకు ‘శ్రీకృష్ణ విజయం’లో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించారు. మళ్లీ ఇప్పుడు తెలుగు తెరపై హేమమాలిని కనిపించనున్నారు. అప్పట్లో డ్రీమ్ గాళ్‌గా కనిపించిన హేమ ఇప్పుడు మమ్మీ పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఆయన తల్లి పాత్ర చేయనున్నారామె. శాతకర్ణి తల్లి గౌతమీ బాలాశ్రీ పాత్రనే ఆమె పోషించనున్నారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత తెలుగులో హేమ నటించనున్న చిత్రం ఇది.