'గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడం ఫన్నీగా ఉంది'
న్యూఢిల్లీ: వర్ధమాన నటుడు అర్మాన్ జైన్ నటించిన తొలి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అతని జీవితంలో ప్రేమ ప్రయాణం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధమూ లేదని ఈ 23 ఏళ్ల యువతార అంగీకరించాడు. దివంగత నట నిర్మాత రాజ్‌కపూర్ మనవడైన అర్మాన్... ఆరిఫ్ అలీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘లేకర్ హం దివానా దిల్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. లావుగా ఉన్న కారణంగానే తనంటే ఎవరూ ఇష్టపడకపోయి ఉండొచ్చన్నాడు. ‘నాకు గర్ల్‌ఫ్రెండ్ ఎవరూ లేరు. ఇలా ఎవరూ లేకపోవడమనేది ఫన్నీగా అనిపిస్తుంది. అయినప్పటికీ నాకు ఆడస్నేహితులెవరూ లేరు. ఇందుకు కారణం నా బరువు 95 కిలోలు కావడమే అయిఉండొచ్చు. అందువల్లనే నావైపు ఎవరూ చూడడం లేదు. ఇదిలా ఉంచితే మరికొంతమంది యువతులు నాకు రాఖీ కట్టారు. నన్ను వారి సోదరుడిగా భావించారు.
చాలా చిన్నతనంనుంచే పని చేయడం ప్రారంభించాను. దృష్టంతా పనిమీదనే ఉంచా. ఎక్కడికైనా బయటికి వెళ్లేందుకు కూడా నాకు తగినంత సమయం కూడా దొరకడం లేదు’ అని అన్నాడు. టీనేజర్‌గా ఉన్న సమయంలో అర్మాన్... కరణ్‌జోహార్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. గర్ల్‌ఫ్రెండ్స్ కోసం కాకుండా పెట్టుబడిదారుడు మనోజ్‌జైన్, రాజ్‌కపూర్ కుమార్తె రీమా కుమారుడైన అర్మాన్... నటుడిగా ఎదగాలనే లక్ష్యంతో మొదటినుంచి తన కొవ్వును తగ్గించుకోవడంపైనే దృష్టి సారించాడు. బాలీవుడ్‌లో అడుగు పెట్టడం కోసం బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సును మధ్యలోనే వదిలేసిన అర్మాన్...తన బరువు కొంతకాలం పెరగడం, మరికొంతకాలం తగ్గడం తరచూ జరుగుతుంటుందన్నాడు. కళాశాలకు వెళుతున్న సమయంలో తాను 12 కిలోల మేర బరువు తగ్గానన్నాడు. ఒకసారి తన బరువు 66 కిలోల వరకూ కూడా తగ్గిందన్నాడు.