జీవితాంతం ఆ ప్లాస్టిక్ ప్లగ్ తలలో ఉండాల్సిందేనట! | Jackie Chan has a permanent hole in his head | Sakshi
Sakshi News home page

జీవితాంతం ఆ ప్లాస్టిక్ ప్లగ్ తలలో ఉండాల్సిందేనట!

Published Sun, Apr 6 2014 11:51 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

జీవితాంతం ఆ ప్లాస్టిక్ ప్లగ్ తలలో ఉండాల్సిందేనట! - Sakshi

జీవితాంతం ఆ ప్లాస్టిక్ ప్లగ్ తలలో ఉండాల్సిందేనట!

ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ‘యాక్షన్ స్టార్’ అనిపించుకున్న జాకీచాన్‌ని చూస్తే ఆరోగ్య బీమా కంపెనీలు పారిపోతాయి. ఎందుకో ఊహించే ఉంటారు. దాదాపు ప్రతి సినిమాకీ గాయాలపాలవ్వడం జాకీచాన్‌కి చాలా కామన్. ఆయనకు మెడిక్లెయిమ్ పాలసీ ఇస్తే, ఇక కంపెనీ దివాళా తీయడం ఖాయం. నటుడిగా జాకీచాన్ లైఫ్ అంత రిస్కీ అన్నమాట. కానీ రిస్కులు చేయడం తనకు కేక్ తిన్నంత సులువు అంటున్నారు జాకీచాన్. నేడు ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు...
 
మామూలుగా ఏ బిడ్డయినా తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటుంది. కానీ, జాకీచాన్ మాత్రం పన్నెండు నెలలు ఉండటం విశేషం. ఫలితంగా శస్త్ర చికిత్స చేసి, బిడ్డను బయటికి తీయాల్సి వచ్చింది. స్వతహాగా పేద కుటుంబం కావడంతో జాకీ తండ్రి వైద్య ఖర్చులకు స్నేహితుడి నుంచి అప్పు తీసుకున్నారు. పుట్టినప్పుడు జాకీ బరువు దాదాపు ఐదున్నర కిలోలు.
 
చిన్నప్పుడు జాకీని ఆయన తల్లి, ఇరుగుపొరుగువారు ‘పావోపావో’ (ఓ బంతి పేరు) అని పిలిచేవారు. బోర్లా పడుకుని బంతిలా దొర్లేవాడట జాకీ. చాలా చురుకుగా ఉండేవాడట. అందుకే ఆ పేరు.
 
ఎనిమిదేళ్ల వయసులో ‘బిగ్ అండ్ లిటిల్ వాంగ్ టిన్ బార్’ అనే చిత్రం ద్వారా జాకీ నటుడిగా పరిచయమయ్యాడు. పెద్దయిన తర్వాత నటుడిగా, స్టంట్ మేన్‌గా, గాయకుడిగా, దర్శక, నిర్మాతగా చేయడం మొదలుపెట్టారు. 
 
వీరోచిత పోరాట దృశ్యాలు చేసే జాకీచాన్, అతని బృందం తరచుగా గాయాలపాలవుతుంటారు. దాంతో వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పోనీ ఏదైనా ఆరోగ్య బీమా చేయించుకుందామంటే ఏ కంపెనీ ముందుకు రాదు. అందుకే తన బృందానికి, తనకు అయ్యే వైద్య ఖర్చులు జాకీచానే భరిస్తారు.
 
అత్యధిక పోరాటాలు చేసిన నటుడిగా, ఒకే సినిమాలో ఎక్కువ శాఖలకు పని చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ పుస్తకంలో రెండు సార్లు స్థానం సంపాదించుకున్నారు జాకీ. 
 
జాకీచాన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘ఆర్మర్ ఆఫ్ గాడ్’ ఒకటి. ఈ షూటింగ్‌లో ఓ చెట్టు కొమ్మ వేగంగా ఆయన తల్లోకి చొచ్చుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. శస్త్రచికిత్స చేసి, డాక్టర్లు జాకీ తలలో ఓ ప్లాస్టిక్ ప్లగ్‌ని అమర్చారు. జీవితాంతం ఇది ఉండాల్సిందేనట. జాకీచాన్ ఇప్పటివరకు లెక్కలేనన్ని సార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నారు. మూడుసార్లు ముక్కు పగిలింది. వేళ్లు, మెడ, చీలమండలం, దవడ ఎముకలు విరిగిన సందర్భాలు బోల్డన్ని ఉన్నాయి. ‘డ్రంకన్ మాస్టర్’ షూటింగ్‌లో ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు ఆయనకు కన్ను పోయినంత పనైంది. 
 
ఒక సన్నివేశం చేసినప్పుడు తనకు పూర్తి సంతృప్తినిస్తేనే జాకీచాన్ ఓకే చేస్తారు. లేకపోతే ఎన్ని టేక్స్ అయినా చేయడానికి వెనకాడరు. ‘డ్రాగన్ లార్డ్’లో ఓ సీన్‌కి 2,900 టేక్స్ తీసుకున్నారాయన. జాకీచాన్ అంకితభావానికి ఈ సంఘటనను ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
 
జాకీచాన్‌కి ఓ కొడుకు ఉన్నాడు. అలాగే, ఎలైన్ అనే నటితో సంబంధం కారణంగా జాకీకి ఓ కుమార్తె పుట్టింది. తన మరణం తర్వాత మొత్తం ఆస్తి బిడ్డలకు వెళ్లదు. ఆస్తిలో సగం చనిపోయిన తర్వాత సేవా కార్యక్రమాలకు ఇచ్చేట్లు వీలునామా రాశారట.
 
ఈ మార్షల్ ఆర్ట్స్ వీరుడు పాప్‌స్టార్ కూడా. ఇప్పటివరకు దాదాపు 20కిపైగా ఆల్బమ్స్‌ని విడుదల చేశారు. అలాగే, తన సినిమాల్లోని థీమ్ సాంగ్స్‌ని కూడా పాడుతుంటారు జాకీచాన్.
 
బాలనటుడిగా ఆరు చిత్రాల్లో నటించారు జాకీ. ఆ తర్వాత పలు చిత్రాలకు స్టంట్‌మేన్‌గా చేశారు. ఈ చిత్రాల్లో బ్రూస్‌లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’ ఒకటి. తన కెరీర్‌లో ఎన్నోసార్లు ప్రమాదాలకు గురైనా తట్టుకోగలిగానని, కానీ, ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో బ్రూస్‌లీ అనుకోకుండా తన మొహం మీద ఇచ్చిన  ఓ పంచ్‌కి కళ్లు బైర్లు కమ్మాయని, ఆ నొప్పి తీవ్రత ఇప్పటికీ గుర్తుందని జాకీచాన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇక, నటుడిగా, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా, దర్శక, నిర్మాతగా, గాయకునిగా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు జాకీ. నటుడిగా ఆయన ఇప్పటివరకు దాదాపు 150 చిత్రాలు చేశారు.
 
తనెప్పుడు రిటైర్ అవ్వాలో తన శరీరం డిసైడ్ చేస్తుందని, అది ఎప్పుడు మొరాయిస్తే అప్పుడు నటన మానేస్తానని ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు జాకీ. గతంలో ఉన్నంత ఎనర్జిటిక్‌గా లేకపోయినా తన ఆరోగ్యానికేం ఢోకా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘స్కిప్‌ట్రేస్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
 
ఒకసారి పన్నెండు రాతి బండలను ఒంటి చేత్తో అమాంతంగా పగలగొట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచారు జాకీ. 
మాండ్రియన్, ఇంగ్లిష్, జర్మన్, కొరియన్, జపనీస్, థాయ్, కాంటనీస్... ఇలా పలు భాషలు మాట్లాడగలరు.
 
- డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement