నర్గిస్ పంట పండినట్టే...
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోయె.. కృతీ సనన్ వచ్చె.. కృతీ పోయె కరీనా కపూర్ వచ్చె.. ఇప్పుడు కరీనా కూడా పోయె.. అని బాలీవుడ్‌లో సరదాగా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆంటోనీ డిసౌజా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అజారుద్దీన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ చేయనున్నారు. ఆయన మొదటి భార్య పాత్రకు ప్రాచీ దేశాయ్‌ని తీసుకున్నారు.
రెండో భార్య సంగీతా బిజ్లానీ పాత్రకు పైన చెప్పిన తారలను అనుకున్నారు. చిత్రనిర్మాత ఏక్తా కపూర్ అయితే ఆ పాత్రను సంగీతా బిజ్లానీతోనే చేయించాలని భావిస్తున్నారట. సంగీత సినిమాలు చేసి, దాదాపు 20 ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ చిత్రం ఒప్పుకుంటారా? అనే సందేహం కూడా ఆమెకు లేకపోలేదు. దాంతో రెండో భార్య పాత్రను నర్గిస్ ఫక్రితో చేయించాలని డిసైడ్ అయిపోయారట. అదే జరిగితే నర్గిస్ పంట పండినట్టే.