తమిళసినిమా: జరుగండి చిత్రాన్ని మంచి క్వాలిటీతో చేశామనే నమ్మకం కలిగిందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నితిన్ సత్య తెలిపారు. నటుడైన ఈయన నిర్మాతగా మారి బద్రి కస్తూరితో కలిసి నిర్మిస్తున్న చిత్రం జరుగండి. జై కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటి రెబామోనికా జాన్ కథానాయకిగా పరిచయం అవుతోంది. రోబోశంకర్, డానీ అన్నె పోప్, ఇళవరసు, బోస్‌వెంకట్, అమిత్, జయకుమార్, జీఎం.కుమార్, నందా శరవణన్, కావ్య ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా పిచ్చుమణి అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు వెంకట్‌ప్రభు వద్ద చెన్నై–28 చిత్రం నుంచి సహాయ దర్శకుడిగా పనిచేస్తూ వచ్చారట. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం పత్రికల వారికి ప్రదర్శించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నితిన్‌సత్య మాట్లాడుతూ నటుడిగా అవకాశాలు వస్తున్నా, మంచి చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనతో గత ఏడాది పాటు నిర్మాణం గురించి స్టడీ చేశానన్నారు. చిత్ర షూటింగ్‌ను 46 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు చాలా కథలను తయారు చేసుకుని అవకాశాల కోసం పలు నిర్మాతలను కలిశారని, అలా తనకు చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. చిత్రానికి జరుగండి అనే తెలుగు టైటిల్ పెట్డడం గురించి అడిగిన ప్రశ్నకు నిజం చెప్పాలంటే ఈ దర్శకుడు ముందుగా వెంకట్‌ప్రభు బ్యానర్‌లో చిత్రం చేశాల్సి ఉందని, ఆ కథకు పెట్టిన ఈ టైటిల్‌ను వెంకట్‌ప్రభునే తమ చిత్రానికి బాగుంటుందని చెప్పారని అన్నారు. జరుగండి టైటిల్ యూనిక్‌గా ఉండడంతో, ఆసక్తిని కలిగించేదిగానూ, చిత్ర కథకు నప్పడంతో ఈ టైటిల్‌ను పెట్టినట్లు వివరించారు. అవసరం అయినప్పుడు తప్పుల్ని కూడా సమర్థించుకునే యువకుడి ఇతి వృత్తమే జరుగండి అని చెప్పారు. ఈ చిత్రం చాలా క్వాలిటీగా వచ్చిందన్న నమ్మకం తనకు కలిగిందన్నారు. త్వరలోనే చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి జూలై చివరలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నితిన్ సత్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment