
మాధురీ, జయా బచ్చన్ లకు 'లచ్చూ' అవార్డు
ప్రముఖ నటి మాధురీ దీక్షిత్, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌లు లచ్చూ మాధురీ అవార్డుకు ఎంపికైయ్యారు.
లక్నో: ప్రముఖ నటి మాధురీ దీక్షిత్, రాజ్యసభ సభ్యురాలు, సీనియర్ నటి జయా బచ్చన్‌లు లచ్చూ మహారాజ్ అవార్డుకు ఎంపిక అయ్యారు. గతంలో శ్రీదేవి, జయప్రదలు సొంత చేసుకున్నఈ అవార్డు జాబితాలో తాజాగా వీరికి స్థానం దక్కింది. 2012 వ సంవత్సరానికి జయా బచ్చన్ ఎంపికవ్వగా, 2013వ సంవత్సరానికి గాను మాధురీ దీక్షిత్ ఎంపికైయ్యారు. వీరికి ఈ ఆవార్డును త్వరలో అందివ్వనున్నట్లు శకుంతల నీరజ్ సంస్థాన్ శుక్రవారం ప్రకటించింది.
దీనికి సంబంధించి వివరాలను సంస్థ డెరైక్టర్ కుంకమ్ ఆదర్శ్ ఐఏఎన్‌ఎస్‌కు వెల్లడించారు. కథక్ నృత్య కళాకారుడైన లచ్చూ మహారాజ్ స్మృతికి చిహ్నాంగా ఈ అవార్డును బహుకరించనున్నారు. లచ్చూ మహారాజ్ 1972లో నృత్యదర్శకత్వంలో రూపొందిన ఏక్ నజర్ చిత్రంలో జయా బచ్చన్ నటించడం విశేషం. కథక్ నాట్యంలో విశేష సేవలందిచిన ఆయన 1978లో మరణించారు. గతంలో ఈ ఆవార్డును గెలుచుకున్న వారిలో శ్రీదేవి, జయప్రదలతో పాటు ఆశా పరేఖ్, రేఖ తదితరులున్నారు. లచ్చూ మహరాజ్‌కు స్వయానా మేనల్లుడైన బిర్జూ మహారాజ్ చేతులు మీదుగా మాధురీ దీక్షిత్, జయాబచ్చన్‌లు అవార్డును అందుకోనున్నారు.