అపజయాలకు నేనే కారణమనుకుంటా!
అనుష్క... అందానికి చిరునామా ఈ నటి. అంతే కాదు మొదట్లో అందాలతో ఆ తరువాత అభినయంతోనూ సినీ లవర్స్‌ను ఆనందపరస్తున్న నాయకి అనుష్క. ఈమె నటించారంటే జయాపజయాలకు అతీతంగా ఆ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుందనే స్థాయికి ఎదిగిన నటి అనుష్క.లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలంటే అనుష్కనే అన్నంతగా పేరు తెచ్చుకున్న ఈ యోగా బ్యూటీ తన మానసిక సమస్యల నుంచి బయటపడేసేది కూడా ఆ యోగానే నంటున్నారు. నటిగా దశాబ్దకాలాన్ని పూర్తి చేసుకున్న ఈ స్వీటీ ఇప్పటి వరకూ తమిళం,తెలుగు భాషల్లో 40 చిత్రాల్లో నటించారు.
ఈ అందాల రాశి నట జీవితంలో జయాపజయాలున్నా అందులో అధిక శాతం విజయాలే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చును. నేటికీ ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ బెంగళూర్ బ్యూటీ ప్రస్తుతం బాహుబలి-2, సింగం చిత్రానికి సీక్వెల్ ఎస్-3 చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో బాగమతి అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో నటించడానికి సిద్ధమవుతున్నారు. అజిత్ తాజా చిత్రంలోనూ అనుష్కనే నాయకి అనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా చిరంజీవి 150వ చిత్ర హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మనే అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
దశకం దాటినా వన్నె తగ్గని అందాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటూపోతున్న అనుష్క అంతరంగం ఏమిటో చూద్దాం. ప్రతి నటీ నటుడు తమ చిత్రాలు విజయం సాధిస్తాయన్న నమ్మకంలోనే కథా పాత్రలను ఎంపిక చేసుకుంటారు. అయితే కొన్ని చిత్రాలు తాము ఆశించినట్లు ఆడవు. అయితే ఒక చిత్ర విజయం సాధించడానికి,నటీనటులు విజయాలతో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వెనుక చాలా మంది కారణం అవుతారు. వారి శ్రమ, సాయం చాలా ఉంటుంది. ఇటీవల నేనే నటించిన బాహుబలి చిత్రం ఘన విజయం సాధించింది.
ఆ విజయాన్ని ఏ ఒక్కరో సొంతంగా భావించరాదు. అది అందులో పని చేసిన వారందరికి చెందుతుంది. అదే విధంగా అపజయాలకు అందరూ బాధ్యత వహించాలి. ఇక నా వరకూ నా చిత్రాల అపజయాలకు పూర్తిగా నేనే కారణంగా భావిస్తాను. మంచి కథలను, దర్శకులను ఎంచుకోవడంలో నేనే పొరపాటు పడి ఉంటాను. అందుకే అపజయాలకు నేనే కారణం అని భావిస్తాను. అయితే అవి నన్ను పెద్దగా బాధించవు. కారణం అలాంటి వాటివల్ల కలిగే మాన సిక చింతల నుంచి యోగా నన్ను బయట పడేస్తుంది. నిత్యం యోగాభ్యాసం చేస్తే ఎలాంటి మనోవేదనల నుంచి అయినా బయట పడవచ్చు.