
'నా ఆందోళనంతా ఎంజెలీనా పిల్లల గురించే'
తన కూతురు చేసే పనుల పట్ల తనకు ఎలాంటి బెంగలేదని, అయితే ఆమె పిల్లల భవిష్యత్ గురించే తన ఆందోళన అని ప్రముఖ హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి తండ్రి, నటుడు జాన్ వోయిట్ అన్నారు.
లాస్ ఎంజెల్స్: తన కూతురు చేసే పనుల పట్ల తనకు ఎలాంటి బెంగలేదని, అయితే ఆమె పిల్లల భవిష్యత్ గురించే తన ఆందోళన అని ప్రముఖ హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి తండ్రి, నటుడు జాన్ వోయిట్ అన్నారు. కొన్ని కారణాల వల్ల తన భర్త బ్రాడ్ ఫిట్ నుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా ఎంజెలీనా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట అధికారికంగా విడిబోతున్నారు. దీంతో ప్రతి ఒక్కరు ఈ ఇద్దరి జీవితంలో భవిష్యత్ లో జరగబోయే పరిణామాలు, జరిగిన అంశాలపైనే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఎంజెలీనా తండ్రి జాన్ తన ఆందోళన వ్యక్తం చేశారు.
'నాకు తెలుసు నా కూతురు ఏం చేసినా మంచే చేస్తుంది. అయితే, నేను ఆమె కుటుంబం, చిన్నారుల గురించే ఆందోళన పడుతున్నాను. బ్రాడ్ ఫిట్, ఎంజెలీనా ఆరుగురు పిల్లలను సాకుతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో అనే నా ఆలోచన' అని అన్నారు. అయితే, జోలి విషయంలో ఇంతకంటే ఎక్కువ స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుతం కూతురు నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న ఈ నటుడు ఓ రకంగా బ్రెంజిలీనా జోడి బద్దలవడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు.