స్వరరాగ గంగాప్రవాహానికి స్వర్ణోత్సవం!
సందర్భం: కె.జె. ఏసుదాస్ తొలి తెలుగు పాటపాడి 50 ఏళ్లు
లాంగ్ జర్నీ చేయాల్సొచ్చింది. తోడుగా ఎవరూలేరు. కె.జె.ఏసుదాస్ ఎంపిత్రీ మాత్రమే ఉంది. కారులో నేను. తోడుగా ఏసుదాస్ పాటలు. కాలం తెలియడం లేదు. అలసట అంతకన్నా లేదు. ఓ మధుర యాత్ర మొదలైంది.
‘ఓ.... నిండు చందమామ... నిగనిగలా భామ....
ఒంటరిగా సాగలేవు... కలిసిమెలసి పోదామా...ఓ...ఓ..ఓ’
అబ్బ... సంగీతం ఎంత శక్తిమంతమైంది. ఎక్కడలేని ఏకాగ్రత. అంతులేని ప్రశాంతత. ‘ఒంటరిగా సాగలేవు... కలిసిమెలసి పోదామా..’ ఇంకేముంది... కొండంత భరోసా ఇచ్చేశారు ఏసుదాస్. మనిషి తోడులేడన్న బాధ క్షణాల్లో దూదిపింజలా ఎగిరిపోయింది.
సంగీతం మధురం. ఇది నిజం. నాలుగైదు పాటలు ఆపకుండా వింటాం. కానీ... ఆరో పాటకొచ్చేసరికి ‘ఇక చాల్లే’ అనిపిస్తుంది. తీపిని అదే పనిగా తినలేం కదా. కానీ ఏసుదాస్ పాట తీయనిది కాదు. ఎందుకంటే... తీపిలా ఆయన పాట వెగటు అనిపించదు. ఏసుదాస్ పాట అమ్మ గోరుముద్ద లాంటిది. ఎప్పటికీ ఆ రుచి వెంటాడుతూనే ఉంటుంది.
సోలో సాంగ్స్ పాడటంలో ఏసుదాస్ కింగ్. సినిమాలో ఆయన పాట ఉందీ అంటే... ‘ఆ ఆల్బమ్‌లో అదే హిట్’. అందులో తిరుగేలేదు. మన దర్శకులు కూడా ఏసుదాస్‌తో అలాంటి పాటలు పాడించడానికే మక్కువ చూపించారు. అయితే.. ఏసుదాస్ పాడిన యుగళగీతాలు కొన్ని ఉన్నాయి. ఆ పాటలు వింటే... మనసుకు చేరువైన వారితో ఇమ్మీడియట్‌గా కాసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది. అంతగా ప్రభావితం చేస్తాయి ఆ పాటలు. కెరీర్ ప్రారంభంలో ఎస్.జానకితో ఆయన పాడిన ‘కొంగున కట్టేసుకోనా..’ పాట అందుకు ఉదాహరణ. ‘ఇద్దరు మొనగాళ్లు’(1966) సినిమాలోని ఈ పాట ఇప్పుడు విన్నా.. హృదయమంతా బరువనిపిస్తుంది.
‘జడతోనే కట్టేసుకోవే... ఓ రాణి రాణి రాణీ...
ఒడిలోన లాలించుకోవే... నను వడిలోన లాలించుకోవే..’
అని ఓ విధమైన జిలుగుతో అంటారాయన. ఆ అక్షరాలు ఏసుదాస్ గళం నుంచి జాలువారుతుంటే మనలో ఏదో తెలీని ఫీలింగ్. ‘శివమెత్తిన సత్యం’(1982)లోని గీతా... ఓ గీతా... డార్లింగ్.. మై డార్లింగ్, ‘పచ్చనికాపురం’(1955)లోని ‘వెన్నెలైనా... చీకటైనా..’ ఇలా చెప్పుకుంటూ పోతే... ఆయన పాడిన డ్యూయెట్లు ఎన్నో.. ఎన్నో.. ఎన్నెన్నో...
ఏసుదాస్ స్వరం మృదంగనాదంలా ఉంటుంది. భావ గంభీరత ఆయనకు దేవుడిచ్చిన వరం. సాధారణమైన పాటకు తన గానంతో చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు ఏసుదాస్. ఆ గళం నుంచి జాలువారి.. చిర స్థానాన్ని సంపాదించిన గాన కుసుమాలు వేలల్లోనే. విరహం, విచారం, వైరాగ్యం, వేదాంతం, భక్తి... ఇలా ఏ భావమైనా... ఏసుదాస్ గొంతు నుంచే వినాలి.
‘దారి చూపిన దేవతా...ఈ చేయి ఎన్నడు వీడక’, ‘ఆలనగా.. పాలనగా అలసిన వేళల అమ్మవుగా’, ‘తకథిమి తకథిమి తోం దీని తస్సాదీయా...’, ‘మిడిసి పడే దీపాలివి.. మిన్నెగసి పడే కెరటాలివి’, ‘రజనీ రజనీ రజనీ పూవవుతున్న మొగ్గవని’, ‘చుక్కల్లే తోచావె’, ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు’, ‘స్వరరాగ గంగా ప్రవాహమే..’, ‘అనురాగమె మంత్రంగా’, ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’... ఇలా చెప్పుకుంటూ పోతే... తెలుగు శ్రోతలకు ఏసుదాస్ అందించిన స్వర వరాలు ఎన్నో. ఈ మధ్య పాడటం కాస్త తగ్గించిన ఏసుదాస్... రీసెంట్‌గా ‘మిథునం’ చిత్రంలో ‘ఆదిదంపతులు..’ పాట పాడారు.
తెలుగులో ఏసుదాస్ పాడిన తొలి పాట ‘బంగారు తిమ్మరాజు’ సినిమాలోనిది. ఎస్పీ కోదండపాణి స్వరాలందించిన ఆ సినిమా విడుదలై నేటికి యాభై ఏళ్లు. అంటే తెలుగు లోగిళ్లలోకి ఏసుదాస్ పాట ప్రవేశించి అయిదు దశాబ్దాలైందన్నమాట. ఇన్నాళ్లుగా తన గానామృతంతో ఓలలాడిస్తూ... శ్రోతల్ని రుణగ్రస్థుల్ని చేశారాయన ‘స్వాతికిరణం’లో చెప్పినట్లు.. నిజంగా... ఏసుదాస్‌ని కన్నవారి జన్మ పావనం. ఆయన పాటలు విన్నవారి జన్మ శ్రావణం.