హీరో అభిమాన సంఘం నిర్వాహకుడి అరెస్ట్
తమిళసినిమా : రాజకీయ నాయకులు శాశ్వతం కాదని, దేశం మాత్రమే శాశ్వతమని విలక్షణ నటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళ రాజకీయాలపై కమల్ తనదైన బాణిలో స్పందిస్తున్న విషయం తెలిసిందే. శాసన సభ్యులు మీ గ్రామాలకు వస్తున్నారు. వారికి తగిన మర్యాద ఇవ్వండి అంటూ ప్రజలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉన్నాయంటూ కమల్‌పై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
కాగా పుదుకొట్టయ్ లో కమలహాసన్ అభిమాన సంఘం నిర్వాహకుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్లికట్లు పోరాటంలో సుధాకర్ రాష్ట్రమంత్రిని అవమానపరచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై కేసు నమోదు చేశారు. ఆ చర్యలను తీవ్రంగా ఖండించిన కమల్ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ..
‘ఇక ప్రజల నీతిని దేశం కాపాడుకుంటుంది. నేను విమర్శించకుండా, శాంతియుతంగానే నడుచుకోవాలని భావించాను. కానీ నా అభిమాన సంఘం కార్యకర్తల అరెస్ట్ మాట్లాడించేలా చేసింది. జల్లికట్టు అంశంలో నా సంఘ కార్యకర్తతో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. అది నా సహనాన్ని, రాజకీయ హింసాత్మక ధోరణిని చూపుతోంది. నా సంఘానికి చెందిన వారు కాస్త నిబద్ధత పాటించాల్సిన సమయం ఇది. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీకి చెందిన వారు మోసాలకు పాల్పడినా అందుకు అతీతంగా సేవ చేసే మనం ఎలాంటి కూలి ఆశించకుండా జీవం ఉన్నంత వరకూ ప్రజలకు సేవ చేద్దాం. రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. మన దేశం శాశ్వత’మని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.