కమల్‌ కొత్త పుంతలు | Kamal Haasan Plans For Makkal Needhi Maiam Party | Sakshi
Sakshi News home page

కమల్‌ కొత్త పుంతలు

Published Thu, Aug 15 2019 10:57 AM | Last Updated on Thu, Aug 15 2019 10:57 AM

Kamal Haasan Plans For Makkal Needhi Maiam Party - Sakshi

పెరంబూరు: మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ తాజాగా ప్రచారానికి కొత్త పుంతలు తొక్కనున్నారు. ఈయన తమ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి కృతనిశ్చయుడవుతున్నారు. ఇంతకు ముందు గ్రామసభల పేరుతో ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకం అయ్యారు. ప్రజల సమస్యలను తెలుచుకునే ప్రయత్నం చేశారు. వారికి మక్కళ్‌నీది మయ్యం పార్టీ విధి విధానాలను తెలియజేయడంలో కొంత వరకూ సఫలం అయ్యారనే చెప్పవచ్చు. అందుకు ఉదాహరణ గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మంచి ఓటు శాతాన్ని సాధించడమే కాక  మక్కళ్‌ నీదిమయ్యం పార్టీ మరింత బలోపేతం చేసి రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గత మేలో గ్రామసభలను నిర్వహించాలని భావించినా ఎన్నికల కారణంగా వాయిదా వేసి జూన్‌ చివరలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలను నిర్వహించారు. ఈ సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు.

అదే విధంగా మరోసారి గ్రామసభలను నిర్వహించడానికి కమలహాసన్‌ సిద్ధం అయ్యారు. ఈ విషయమై ఇటీవల పార్టీ నిర్వాహకులకు, కార్యకర్తలకు  టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశాలను చేశారు. తాము చేసిన తీర్మానాలను, వాటి ఆవశ్యగతలను వివరించారు. కాగా గురువారం నుంచి ప్రజల వద్దకు వెళ్లనున్నారు. ఈ సారి గ్రామసభలకు బదులుగా ప్రాంతసభల పేరుతో నిర్వహించనున్నారు. అయితే ఈ సారి కమలహసన్‌ ప్రచారంలో కొత్తపుంతలు తొక్కనున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 డివిజన్లను ఏర్పాటు చేసి డివిజన్‌కు ఇద్దరు చొప్పున 16 మంది కార్యదర్శులను నియమించనున్నారు. అలాగే 8 మందితో ఒక కమిటీని, 4 రాష్ట్ర కార్యదర్శులను నియమించి కొత్త ప్రచార వ్యూహంతో పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంత సభల్లో పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలందరూ విరివిగా పాల్గొనాలని కమలహాసన్‌ బుధవారం ఆదేశాలను జారీ చేశారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంత సభలను మక్కళ్‌ నీది మయ్యం పార్టీ నిర్వహించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement