
‘పాపనాశం’లో కమల్ నిమగ్నం
నటుడు కమలహాసన్ పాపనాశం చిత్ర షూటింగ్‌లో పూర్తిగా లీనమైపోయాడు. ఆయన నటిస్తున్న విశ్వరూపం-2, ఉత్తమవిలన్ చిత్రాల షూటింగ్ పూర్తి కావడంతో తాజా చిత్రం పాపనాశం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మలయా ళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని సాధించిన దృశ్యం చిత్రానికి రీమేక్ పాపనాశం. ఈ చిత్రంతో కమల్ సరసన నటించే నటి ఎవరన్న విషయంపై శ్రీదేవి, సిమ్రాన్ మొదలగు సీనియర్ నటీమణుల పేర్లు ప్రచారమయ్యాయి. చివరికి కమల్‌తో నటించే అవకాశం నటి గౌతమికి దక్కింది.
ఈ చిత్ర షూటింగ్ తిరునల్వేలి సమీపంలోని నంగునెరి, పాపనాశం ప్రాంతాలలో ముమ్మరంగ సాగుతోంది. కాగా చిత్ర షూటింగ్ విరామ సమయాల్లో కమల్ ఆ ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక పండితుల్ని, సామాజిక సేవకులను కలుసుకోవడం విశేషం. నంగునేరిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి తోడాద్రి నాదర్ వైష్ణవ మఠాన్ని సందర్శించి మఠంలోని జీయర్‌ను కలుసుకున్నారు. అక్కడాయన చొక్కా తీసి ఒంటికి విబూది పూసుకోవడంతో విమర్శలు ఎదరయ్యాయి. అనంతరం కమల్ ప్రముఖ పరిశోధకుడు టీ.పరమశివంను కలిశారు. తెన్‌కాశిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన సామాజిక సేవకుడు కృష్ణను కలిసి సంభాషించారు. కమల్‌లోని ఈ మార్పునకు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.