
విమానం అదృశ్య కథ
గత ఏడాది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియా విమానం అదృశ్యమై పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తమిళసినిమా: గత ఏడాది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియా విమానం అదృశ్యమై పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన నేటికీ మిస్టరీగానే ఉంది. ఆ మలేషియా విమానం నేపథ్యంలో ఒక భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. అంతేకాదు విశ్వనాయకుడు కమలహాసన్. సంచలన నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవాల కలయికలో ఒక క్రేజి చిత్రం తెరకెక్కనుందనే వార్తను ఇంతకుముందే వెల్లడించారు. ఆ సరికొత్త కలయికలో తెరకెక్కనున్న సంచలన చిత్రం ఇదేనన్నది తాజా సమాచారం.
ఈ చిత్రం కోసం లొకేషన్ ఎంపిక చేయడానికి కమలహాసన్ మారిషస్ వెళ్లారు. ప్రభుదేవా కూడా వెళ్లాల్సి వున్నా ఆయన హిందీ చిత్రం సింగ్ ఈజ్ కింగ్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండడం వలన వెళ్లలేకపోయినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరో విషయం ఒక సంచలన నవల కాన్సెప్ట్‌ను తీసుకుని కమలహాసన్ స్వయంగా కథ, కథనం తయారు చేస్తున్నట్లు సమాచారం. కమల్, ప్రభుదేవా కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
కమల్ ప్రస్తుతం ఉత్తమ విలన్, పాపనాశం, విశ్వరూపం-2 వంటి మూడు చిత్రాలను పూర్తి చేశారు. ఇవి వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రభుదేవా సింగ్ ఈజ్ కింగ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్నారు. దీంతో వీరి కలయికలో తెరకెక్కనున్న చిత్రాన్ని ఏప్రిల్‌లో సెట్‌పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న నటిని హీరోయిన్‌గా ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు కోలీవుడ్ టాక్.