
పొలిటికల్ ఎంట్రీపై వివరణ ఇచ్చిన కంగనా
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ భామ కంగనా రనౌత్ రాజకీయ ప్రవేశంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఆమె ఓ రాజకీయ పార్టీలో చేరుతున్నారని, ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారనీ.. ఇలా పలు వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో కంగనా వివరణ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆమె ప్రతినిధి అధికారిక ప్రకటన చేశారని బాంబే టైమ్స్ రిపోర్ట్ చేసింది.
క్వీన్ నటి కంగనా త్వరలో రాజకీయాల్లోకి రానున్నారంటూ కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది. ప్రధాని మోదీతో సమావేశమైనట్టు వచ్చిన వార్తలు నిరాధారమైనవని కంగనా ప్రతినిధి స్పష్టం చేశారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని స్వయంగా కంగనా పలుమార్లు చెప్పారని, బికనీర్‌లో మణికర్ణిక సినిమా షూటింగ్‌లో ఆమె బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. అసత్య వార్తలను నమ్మవద్దని.. అవసరమైతే అధికారికంగా ఏ విషయమైనా కంగనా ప్రకటిస్తారని చెప్పారు.