ఆ ఇద్దరు వదులుకున్న సినిమాలో కరీనా
ఇటీవలి కాలంలో హిందీ రంగంలో కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమాలు ఎక్కువయ్యాయి. కహానీ, క్వీన్.. ఇలా ఈ మధ్య విడుదలైన లేడీ ఓరియంటెడ్ సినిమాలన్నీ ఘనవిజయాలు సాధించాయి. తాజాగా ‘కహానీ’ దర్శకుడు సుజయ్ ఘోష్ మరో కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమా రూపొందించనున్నారు. పోలీసు అధికారి దుర్గా రాణీసింగ్ జీవితం ఆధారంగా ఆయన ఓ కథ తయారు చేశారు. ఈ సినిమాకి ఆమె పేరునే టైటిల్‌గా పెట్టారు. కాగా, తన ‘కహానీ’ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన విద్యాబాలన్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ కథ రాసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల విద్య ఈ చిత్రాన్ని తిరస్కరించారు.
దాంతో ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో విజృంభిస్తున్న కంగనా రనౌత్‌ని అడిగారు సుజయ్. కంగనాకి కథ నచ్చింది కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్‌లో చేరడానికి ముందే ప్లాన్ చేసుకోవడంవల్ల, ఆమె కూడా ఈ చిత్రాన్ని కాదనేశారు. ఆ తర్వాత సుజయ్ మనసులో మెదిలిన నాయిక కరీనాకపూర్. ఈ సినిమా కోసం ఆమెను సంప్రదించారట. ’కహనీ’ లాంటి మంచి చిత్రాన్ని అందించిన సుజయ్‌తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నా, ఇద్దరు నాయికలు వదులుకున్న సినిమాను తను అంగీకరించాలా? లేదా? అనే ఆలోచనలో పడ్డారట కరీనా. చివరికి ఇలాంటి మంచి సినిమాను వదులుకుంటే, భవిష్యత్తులో మళ్లీ అవకాశం రాదేమోనని భావించి ‘దుర్గా రాణీసింగ్’గా చేయడానికి పచ్చజెండా ఊపేశారు.