
ఈడకల్లు చంద్రశేఖర్ (ఫైల్)
సాక్షి, బెంగళూరు: కన్నడ సీనియర్ నటుడు ఈడకల్లు చంద్రశేఖర్ (63) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా కెనడాలోని ఒట్టావాలో ఆయన తల్లి, భార్య, కుమార్తెతో కలసి ఉండేవారు. శనివారం తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మరణించినట్లు కుమార్తె తాన్య నిర్ధారించారు. చంద్రశేఖర్ బాలనటుడిగా సినిమాల్లోకి ప్రవేశించారు. పుట్టన్న కనగల్ దర్శకత్వం చేపట్టిన ఈడకల్లు గుడ్డమెలే చిత్రం ద్వారా ఆయన అందరికీ సుపరిచితుడు అయ్యాడు. ఆ సినిమా విజయం తర్వాత అదే ఆయన ఇంటి పేరుగా మారింది. సంపంతిగె సవాల్, హంసగీతె, రాజా నన్న రాజ, శివలింగ, అస్తిత్వ, మొగ్గియ కనసు, శంకర్ గురు వంటి కొన్ని సినిమాలు చేశారు.
పూర్వపర అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఈ సినిమాను పలు విదేశీ చిత్రోత్సవాల్లో ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో 60 చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం.. 3 గంటె 30 దిన 30 సెకండ్. ఈ సినిమా ఈ నెలలోనే విడుదలయింది. ఆయన చాలాఏళ్ల కిందటే కెనడాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కెనడాలోని భారత రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేశారు. చంద్రశేఖర్ అంత్యక్రియలు కెనడాలో నిర్వహిస్తున్నటు సన్నిహితులు తెలిపారు. బెంగళూరులో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment