'కనుపాప' మూవీ రివ్యూ | Kanupapa Movie Review | Sakshi
Sakshi News home page

'కనుపాప' మూవీ రివ్యూ

Published Fri, Feb 3 2017 9:38 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

Kanupapa Movie Review

టైటిల్ : కనుపాప
జానర్ : క్రైం థ్రిల్లర్
తారాగణం : మోహన్ లాల్, సముద్రఖని, అనుశ్రీ, బేబీ మీనాక్షి, నెడుముడి వేణు
సంగీతం : రోన్ ఎతన్ యోహన్
దర్శకత్వం : ప్రియదర్శన్
నిర్మాత : మోహన్ లాల్

మలయాళ సూపర్ స్టార్గా ఉన్న మోహన్ లాల్ ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ మార్కెట్ల మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే జిల్లా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన కంప్లీట్ యాక్టర్ ఇప్పుడు తన ఇతర చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. అదే బాటలో గత ఏడాది మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒప్పం సినిమాను కనుపాప పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మాలీవుడ్లో 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది..?

కథ :
గుడ్డివాడైన జయరామ్ (మోహన్ లాల్).. తన ఊరికి దగ్గర్లో ఉన్న సిటీలోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. తన సంపాదనతోనే చెల్లికి ఘనంగా పెళ్లిచేసేందుకు కష్టపడుతుంటాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్లో ఉండే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కృష్ణమూర్తికి (నెడుముడి వేణు) చేదోడు వాదోడుగా సహాయం చేస్తుంటాడు. కంటిచూపు లేకపోయినా.. శబ్దాల ద్వారా, వాసనల ద్వారా కంటిచూపు ఉన్న వారికంటే బాగా అన్ని పనులు చేసుకోవటంతో పాటు వ్యక్తులను గుర్తించగలుగుతాడు. అయితే జయరామ్కు ఈ శక్తి వల్ల అతను గుడ్డివాడుగా నటిస్తున్నాడన్న అనుమానం కూడా కొందరికి కలుగుతుంది.

కృష్ణమూర్తి ఎవరికీ తెలియకుండా నందిని(మీనాక్షి) అనే అమ్మాయిని ఊటిలో ఉంచి చదివిస్తుంటాడు. అదే సమయంలో వాసుదేవ్(సముద్రఖని) అనే వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. ఈ ప్రయత్నం కొనసాగుతుండగానే కృష్ణమూర్తి హత్యకు గురవుతాడు. ఆ నేరం జయరామ్ మీద పడుతుంది. ఇంతకీ కృష్ణమూర్తిని ఎవరు చంపారు..? కృష్ణమూర్తి దూరంగా ఉంచి పెంచుతున్న అమ్మాయి ఎవరు..? కృష్ణమూర్తి వెతుకుతున్న వాసుదేవ్ ఎవరు.. ? ఈ  సమస్యలన్నింటి నుంచి జయరామ్ ఎలా బయట పడ్డాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
మాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్ హీరోగా కథబలం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో కంప్లీట్ యాక్టర్ అన్న టైటిల్ను సార్థకం చేసుకుంటున్నాడు. కనుపాప సినిమాలో గుడ్డివాడిగా నటించిన మోహన్ లాల్ మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. తన మీద పడ్డ నింద చెరిపేసుకోవటం, అదే సమయంలో ఒక పసి పాప ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఓ గుడ్డివాడు చేసిన పోరాటాన్ని తెర మీద ఆవిష్కరించాడు. సైకో విలన్గా సముద్రఖని నటన సూపర్బ్. సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా కేవలం తన ఎక్స్ప్రెషన్స్ తోనే విలనిజాన్ని పండించాడు సముద్రఖని. నందిని పాత్రలో నటించిన మీనాక్షి ముద్దు ముద్దు మాటలతో అలరించింది. ఇతర పాత్రల్లో నెడుముడి వేణు, విమలారామన్, అనుశ్రీ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
గతంలో మోహన్ లాల్ కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రియదర్శన్ మరోసారి అదే రికార్డ్ ను కంటిన్యూ చేస్తూ తెరకెక్కించిన చిత్రం కనుపాప. అయితే ఈ సారి మోహన్ లాల్ నటన మీద ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రియదర్శన్, కథనాన్ని మాత్రం కాస్త తీరిగ్గా నడిపించాడు. నటుడిగా మోహన్ లాల్ ను ఎలివేట్ చేసే సీన్స్ లె పర్ఫెక్ట్ గా రాసుకున్న ప్రియదర్శన్, థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన స్పీడు మాత్రం చూపించలేదు. స్లో నారేషన్ కాస్త ఇబ్బంది పెట్టిన 4 మ్యూజిక్స్ గ్రూప్ ఇచ్చిన సంగీతం, ఏకాంబరం అందించిన సినిమాటోగ్రఫి ఆడియన్స్ ను కదలకుండా కూర్చోపెడతాయి. మోహన్ లాల్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్ :
మోహన్ లాల్ నటన
సినిమాటోగ్రఫి
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
తెలుగు నేటివిటి లేకపోవటం
స్లో నారేషన్

కనుపాపలో ప్రియదర్శన్ కాస్త తీరిగ్గా కథ నడిపించినా.. మోహన్ లాల్ తన అద్భుత నటనతో అన్ని మైనస్లను కవర్ చేశాడు.

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement