ప్రెట్టీ కుట్టి | Kerala heroines magic acting in telugu | Sakshi
Sakshi News home page

ప్రెట్టీ కుట్టి

Published Tue, Jan 10 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

ప్రెట్టీ కుట్టి

ప్రెట్టీ కుట్టి

‘హలో...’ ‘కేరళ ఎక్కడ ఉంది?’ ‘కనపడటంలేదు.. కొంచెం బైనాక్యులర్స్‌ తీసుకు రండి!’ ‘అదిగో అక్కడ చిన్నగా ఉందే... అదే కేరళ.’
‘కేరళ అక్కడెక్కడో కింద ఉంది కానీ... అక్కడి హీరోయిన్లు చూశారా... ఇక్కడ ఎంత ఎత్తుకి ఎదిగారో! పవన్‌ కల్యాణ్, రామ్‌చరణ్, నాగచైతన్య... ఇలా స్టార్ల పక్కన నటిస్తున్నారు. ఈ ప్రెట్టీ కుట్టీలు చూడ్డానికి బ్యూటీగానే కాదు.. యాక్టింగ్‌తో కూడా మేజిక్‌ చేస్తున్నారు.’

ఆలస్యమే అమృతం!
‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. అలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని ఈ సామెతకు అర్థం. కానీ, నివేదా థామస్‌ ప్రయాణం చూస్తే అలస్యమే అమృతమైందని చెప్పాలేమో! ‘అందాల రాక్షసి’ ఫేమ్‌ నవీన్‌ చంద్ర, నివేదా థామస్‌ జంటగా అప్పట్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఆ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో నాని ‘జెంటిల్‌మన్‌’తో తెలుగు తెరకు పరిచయమయ్యారామె. అప్పటికే, తమిళంలో విజయ్‌ ‘జిల్లా’, కమల్‌హాసన్‌ ‘పాపనాశం’ చిత్రాల్లో చేసిన కీలక పాత్రలతో నటిగా నివేదకు మంచి పేరొచ్చింది. తెలుగులో తొలి సినిమా ‘జెంటిల్‌మన్‌’తో ఇక్కడి ప్రేక్షకులు, చలనచిత్ర ప్రముఖులను ఆకట్టుకున్నారు. అందం, అభినయం.. రెండిటిలోనూ నివేదకు మంచి మార్కులు పడ్డాయి. ‘జెంటిల్‌మన్‌’ తర్వాత నానీకి జంటగా మరోసారి నటిస్తున్నారీ భామ. శివ నిర్వాణని దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో నాని, నివేద, ఆది పినిశెట్టి నటిస్తున్నారు.

స్టార్స్‌ లిస్ట్‌లో...
సమంత వంటి స్టార్‌ హీరోయిన్‌ సినిమాలో ఉన్నప్పుడు... అందులోనూ ఆమె పాత్ర చుట్టూ నడిచే ఫీమేల్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ అయినప్పుడు... అందులో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన అమ్మాయికి అరుదుగా గుర్తింపు లభిస్తుంది. కానీ, ‘అ.. ఆ’ ప్రచార చిత్రాల్లో అనుపమా పరమేశ్వరన్‌ చెప్పిన ‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్ల ఆయన్ను పవన్‌కల్యాణ్‌ అనే అనుకుంటుంది’ అనే డైలాగ్‌ ఆమెకు పాపులారిటీ తీసుకొచ్చింది. ‘అ.. ఆ’లో కనిపించినంత సేపూ అందమైన నటనతో ఆకట్టుకున్న అనుపమ, తన పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ కూడా చెప్పారు. అసలు మలయాళంలో అనుపమ హీరోయిన్‌గా పరిచయమైన ‘ప్రేమమ్‌’ పెద్ద హిట్‌. ఆ చిత్రం తెలుగు రీమేక్‌లో మాతృకలో చేసిన పాత్ర చేశారు. అయితే.. అనుపమ చేసిన ‘అ.. ఆ’, ‘ప్రేమమ్‌’ రెండూ  మల్టీ హీరోయిన్‌ చిత్రాలే. త్వరలో సోలో హీరోయిన్‌గా సందడి చేయనున్నారు.

శర్వానంద్‌ సరసన ఆమె నటించిన ‘శతమానం భవతి’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇది కాకుండా అనుపమ తాజాగా ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కించుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ నిర్మించనున్న చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ను నాయికగా తీసుకున్నారని సమాచారం. మెల్లిగా అనుపమ స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోతున్నారు.

తక్కువ టైమ్‌లో కీర్తి
తెలుగు తెరపై కీర్తీ సురేశ్‌ అడుగుపెట్టి సరిగ్గా సంవత్సరం అవుతుంది. గత ఏడాది జనవరి 1న విడుదలైన రామ్‌ ‘నేను – శైలజ’తో ఈ మలయాళ ముద్దుగుమ్మ మన తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ చిత్రం చూసిన వాళ్లంతా... మన పక్కింటి అమ్మాయిలా భలే నటించిందీ హీరోయిన్‌ అన్నారు. ఆవేదన, ఆనందం, అలజడి.. ఏదైనా మనసులోనే దాచుకునే శైలజ పాత్రలో కీర్తీ సురేశ్‌ భావోద్వేగాలు పండించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

‘నేను –శైలజ’ తర్వాత తమిళ అనువాద చిత్రాలు ‘రైల్‌’, ‘రెమో’లతో తెలుగు తెరపై కనిపించారు తప్ప... కీర్తీ సురేశ్‌ స్ట్రయిట్‌ తెలుగు చిత్రంతో మన ముందుకు రాలేదు. కానీ, ఆమెకు మంచి ఛాన్సులు వచ్చాయి. హీరో నానీకి జోడీగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఆమె నటించిన ‘నేను లోకల్‌’ ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇది కాకుండా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించనున్న సినిమాలో ఆయనకు జోడీగా నటించే బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారు. మరోవైపు తమిళంలోనూ విజయ్, సూర్య వంటి స్టార్‌ల సరసన నటిస్తున్నారు.

కళ్లు మూసి తెరిచే లోపే
‘కళ్లు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే...’ – ‘మజ్ను’ చిత్రంలో హీరోయిన్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌ను చూసి ప్రేమలో పడిన హీరో నాని పాడిన పాట ఇది. ఈ అమ్మాయి నవ్వు, నటనకు ఫిదా అయిన యువత కూడా థియేటర్‌ బయటకొచ్చిన తర్వాత ఈ పాటే పాడారు. ‘మజ్ను’ హిట్‌తో అనూకి సూపర్‌ ఛాన్స్‌ వచ్చింది. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్‌ చేతిలో మూడు సినిమాలున్నాయి. గోపీచంద్‌ ‘ఆక్సిజన్‌’, రాజ్‌తరుణ్‌ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలను ‘మజ్ను’లో నటిస్తున్నప్పుడే అంగీకరించారామె. ఈ రెండూ వినూత్న కథలతో రూపొందుతోన్న చిత్రాలే. ఇక, ‘మజ్ను’ విడుదల తర్వాత ఆమెకు వచ్చిన ఛాన్స్‌ స్టార్‌ హీరోయిన్స్‌ రేసులోకి తీసుకువెళ్లింది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించనున్న ప్రేమకథా చిత్రంలో ఓ నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్‌ ఎంపికయ్యారు. ఈ ఛాన్స్‌ ఆమెను కూడా సర్‌ప్రైజ్‌ చేసింది. ‘‘ఓ ఐదేళ్ల తర్వాత ఎప్పుడో పవన్‌కల్యాణ్‌ పక్కన నటించే ఛాన్స్‌ వస్తుందనుకున్నా! తెలుగు తెరకు పరిచయమైన ఏడాదిలోపే వస్తుందనుకోలేదు’’ అన్నారు అను. ఈ మూడు చిత్రాలూ ఈ ఏడాదే విడుదల కానున్నాయి. ఈలోపు అనూ ఇమ్మాన్యుయేల్‌ ఇంకెన్ని ఛాన్సులు అందుకుంటారో!

మలయాళీ హీరోయిన్లు తెలుగు తెరపై రాణించడం ఇదేమీ కొత్త కాదు. ఆల్రెడీ అసిన్, మమతా మోహన్‌దాస్, మీరా జాస్మిన్, నయనతార, నిత్యామీనన్‌ తదితర కేరళ కుట్టీలు మనవాళ్లను తెగ మెప్పించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్, నివేదా థామస్, కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్‌లు ఒక్క ఏడాదిలో తెలుగు తెరపై తారాజువ్వలా దూసుకెళుతుండడం చెప్పుకోదగ్గ విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement